janamvoice.com
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 1:32 pm Digital Edition : JANAM VOICE

వెంచర్ అనుమతులకు లంచం.

వెంచర్ అనుమతులకు లంచం.

  • ఏసీబీ వలలో నర్సింహులపేట మండల  ఎంపీడీఓ, ఎంపీఓ.

మహబూబాబాద్ జిల్లా బ్యూరో / జనం వాయిస్ : 

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఇద్దరు అధికారులతో పాటు ఒక మధ్యవర్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలోని బృందం నిర్వహించిన ఈ దాడుల్లో, మండల పరిధిలోని ఓ నూతన వెంచర్‌కు సంబంధించిన అనుమతులు మంజూరు చేయడానికి రూ.45 వేల లంచం తీసుకుంటుండగా ఎంపీడీవో రాధిక, ఎంపీవో కిన్నెర యాకయ్యలను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన ఎంపీడీవో కుమారుడు రాంప్రసాద్‌ను కూడా అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదు మేరకు ముందస్తు ప్రణాళికతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సంబంధిత పత్రాలు, రికార్డులను పరిశీలిస్తూ కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అధికారులు నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.