janamvoice.com
Newspaper Banner
Date of Publish : 01 January 2026, 8:00 pm Digital Edition : GATTU MAHESH

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ.

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ.

– కాంగ్రెస్ పాలనలో ప్రజల జీవితాల్లో మార్పు లేదు: కేటీఆర్.
– రాష్ట్రం అభివృద్ధి కాదు, తిరోగమన దిశలో ప్రయాణిస్తోంది.
– 2028లో కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా చూడటమే లక్ష్యం.

జనం వాయిస్, హైదరాబాద్, జనవరి 01:

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన భావోద్వేగభరితమైన ప్రసంగం చేశారు. క్యాలెండర్లు మారుతున్నాయే తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో ఓటేసిన ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రాలేదని తీవ్రంగా విమర్శించారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రం అభివృద్ధి వైపు కాకుండా తిరోగమన దిశలో ప్రయాణిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు ఉన్న దుస్థితి మళ్లీ రాష్ట్రానికి తిరిగి వస్తోందని కేటీఆర్ అన్నారు. పండుగ వాతావరణం ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారని, చలికాలంలో కూడా గంటల తరబడి, దినాల తరబడి లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో మళ్లీ వచ్చిందని విమర్శించారు. ఇది రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన కేటీఆర్, కేంద్రంతోనూ సమైక్యవాదులతోనూ 14 ఏళ్ల పాటు కేసీఆర్ నాయకత్వంలో సాగిన పోరాటాన్ని స్మరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిందని చెప్పారు. ఆ ప్రగతి సంతకాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారని కేటీఆర్ కొనియాడారు. జెండాను చేతబట్టి నడిపించే నాయకులకంటే, ఆ జెండాను భూమిలో నిటారుగా పాతి “ఇది నా జెండా” అని గర్వంగా చెప్పే కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రతి పోరాటంలో ముందుండి నడిపించిన కార్యకర్తలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
లగచర్లలో గిరిజనులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా, రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన తీరుకు వ్యతిరేకంగా, రైతుబంధును రెండుసార్లు ఎగ్గొట్టిన అన్యాయంపై, ఆరు గ్యారంటీలు–420 హామీలపై ప్రజా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన కార్యకర్తలను కేటీఆర్ ప్రశంసించారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న దాష్టీకానికి వ్యతిరేకంగా గళమెత్తినవారిని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల ఆక్రమణకు నిరసనగా నిలిచిన విద్యార్థులను, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అన్యాయానికి ఎదురు నిలుస్తున్న తెలంగాణ ప్రజలను ఆయన ప్రత్యేకంగా స్మరించారు. 2026లోకి అడుగుపెడుతున్న ఈ శుభసందర్భంలో గెలుపులు, ఓటములు శాశ్వతం కావని, అవి తాత్కాలికమని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం, గులాబీ జెండా స్థానం మాత్రం శాశ్వతమని స్పష్టం చేశారు. ఇతర పార్టీలకు రాజకీయాలు ఆటలాంటివైతే, తెలంగాణ సాధించిన బీఆర్‌ఎస్‌కు రాజకీయాలు ప్రజల సంక్షేమానికి సంబంధించిన ధర్మమని, ఒక విధి అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఒకవైపు పోరాటాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం అవసరమని కేటీఆర్ సూచించారు. పోరాటం, నిర్మాణం రెండింటినీ ఆధారంగా చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కేంద్రం, రాష్ట్రం కలిసి బీఆర్‌ఎస్‌పై దాడి చేస్తున్న పరిస్థితి ఉన్నా, ప్రజల ఆశీర్వాదం, దైవ ఆశీర్వాదం ఉన్నంతకాలం ఎవరూ బీఆర్‌ఎస్‌ను అణచివేయలేరని ధీమా వ్యక్తం చేశారు. 2028లో మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడటమే బీఆర్‌ఎస్ లక్ష్యమని, అదే తమ ధ్యేయమని కేటీఆర్ స్పష్టం చేశారు.