రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణల వేగం.
– రీసర్వే, 22ఏ జాబితా, గ్రీవెన్సుల పరిష్కారంపై సీఎం చంద్రబాబు సమీక్ష.
– జూన్ నుంచి ఆటోమ్యూటేషన్ ప్రక్రియ వేగవంతం.
– 6,693 గ్రామాల్లో రీసర్వే పూర్తి – భూ రికార్డుల అప్‌గ్రేడేషన్.
– 5.28 లక్షల గ్రీవెన్సులలో 4.55 లక్షలు పరిష్కారం.
జనం వాయిస్,అమరావతి,డిసెంబర్ 09:
రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీజీఆర్‌ఎస్ సహా 22ఏ జాబితా, ఫ్రీహోల్డ్‌లో ఉంచిన అసైన్డ్ భూములు, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రీసర్వే, ఆదాయ–కుల ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియ వంటి అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. పాలనా సంస్కరణల అమలుతో రెవెన్యూ శాఖ పనితీరులో పారదర్శకత, బాధ్యత పెరగడంతో ఆటోమ్యూటేషన్ వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతున్నదని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
జూన్ 2024 నుంచి ఇప్పటివరకు 22ఏ జాబితా నుంచి తప్పించాలని కోరుతూ 6,846 దరఖాస్తులు అందాయి. పూర్వసైనికులు, రాజకీయ బాధితులు, స్వాతంత్ర్య సమరయోధులు, 1954 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగిన వారి భూములను ప్రభుత్వం 22ఏ నుంచి ఇప్పటికే తేలిగించింది. ఈ నిర్ణయంతో న్యాయమైన హక్కులు కోల్పోకుండా చూడాలన్న ప్రభుత్వ సంకల్పం స్పష్టమవుతుందని అధికారులు చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న భారీ రీసర్వే కార్యక్రమంలో 6,693 గ్రామాల్లో సర్వే పూర్తయింది. ఇవన్నీ వెబ్ ల్యాండ్ 2.0లో నమోదు చేయబడగా, రికార్డుల అప్‌గ్రేడేషన్‌లో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని సమావేశంలో వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో 5,74,908 ఎకరాల అసైన్డ్ భూములను ఫ్రీహోల్డ్‌గా మార్చిన వివరాలపై పునఃపరిశీలన కొనసాగుతోందని తెలిపారు.
గ్రీవెన్సుల పరిష్కారంపై కూడా ముఖ్యమంత్రి దృష్టి సారించారు. గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు మొత్తం 5,28,217 ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో 4,55,189 ఫిర్యాదులు పరిష్కరించబడినట్లు, మరో 73 వేల గ్రీవెన్సులు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు వేగవంతమైన సేవలందించడమే రాబోయే నెలల్లో ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.