janamvoice.com
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 8:39 pm Digital Edition : JANAM VOICE

ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్రం నోటీసులు.

ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్రం నోటీసులు.

అభ్యంతరకర ప్రకటనలపై ఆగ్రహం.
వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం.
చట్టపరమైన చర్యల హెచ్చరిక.

జనం వాయిస్, న్యూఢిల్లీ, జులై 5:

పిల్లలకు సంబంధించిన అభ్యంతరకర ప్రకటనలు ప్రసారమవుతున్నాయన్న ఆరోపణలపై ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అభ్యంతరకర ప్రకటనలను తక్షణమే తొలగించాలని ఆదేశించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ, ఈ వ్యవహారంపై పూర్తి వివరణను వారం రోజుల్లోగా సమర్పించాలని సూచించింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలపై లైంగిక దోపిడీని ప్రోత్సహించేలా కనిపిస్తున్న చెల్లింపు ప్రకటనలు ప్రసారమవుతున్నట్లు వెలుగులోకి రావడంతో కేంద్రం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి కంటెంట్‌ను వెంటనే తొలగించడంతో పాటు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్యలను వివరించాలని మెటాను ఆదేశించింది.
ఈ అంశంపై ఇటీవల అంతర్జాతీయ మీడియా కథనం వెలువడిన అనంతరం విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, వెంటనే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించగా, ఆదివారం సంబంధిత శాఖ మెటాకు అధికారిక నోటీసులు పంపింది. అభ్యంతరకర ప్రకటనలు ఎలా అనుమతించబడ్డాయో, వాటి నియంత్రణకు ఎలాంటి వ్యవస్థ అమల్లో ఉందో వివరించాలని కేంద్రం కోరింది. అలాగే భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్‌ను గుర్తించి అడ్డుకునేందుకు అనుసరించబోయే విధానాలపై కూడా స్పష్టమైన నివేదిక ఇవ్వాలని సూచించింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపిస్తున్న కొన్ని ప్రకటనలపై క్లిక్ చేస్తే ఇతర వేదికలకు మళ్లించి అభ్యంతరకర కంటెంట్‌ను అందిస్తున్నట్లు కేంద్రం గుర్తించినట్లు సమాచారం. ప్రకటనల ద్వారా ఆదాయం లభిస్తున్నందున వాటి పర్యవేక్షణ బాధ్యత నుంచి సంస్థ తప్పించుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. మెటా సమర్పించే వివరణ సంతృప్తికరంగా లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సామాజిక మాధ్యమాల్లో పిల్లల భద్రతకు భంగం కలిగించే, చట్టవ్యతిరేక కంటెంట్‌పై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.