janamvoice.com
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 9:44 am Digital Edition : GATTU MAHESH

మేడారం మహాజాతర ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమీక్ష.

మేడారం మహాజాతర ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమీక్ష.

– జంపన్న వాగు వరకు బస్సులో ప్రయాణించి పరిశీలన.
– ఏఐ, డ్రోన్, సీసీ కెమెరాలతో భద్రతా పర్యవేక్షణ.
– గద్దెల పునరుద్ధరణ పనులపై ప్రత్యేక దృష్టి.

జనం వాయిస్, మేడారం:

అతిపెద్ద ఆదివాసీ పండుగగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర కోసం చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సహచరులతో కలిసి బస్సులో జంపన్న వాగు సర్కిల్ వరకు ప్రయాణించి, జాతరకు వచ్చే లక్షలాది భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మహాజాతరకు సంబంధించి పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ముఖ్యమంత్రి పర్యవేక్షించారు. సీసీ కెమెరాల అనుసంధానం, డ్రోన్ కెమెరాల వినియోగం, ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థల అమలుపై పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా సీసీ కెమెరాల పనితీరు, గుంపుల నియంత్రణ, భద్రతా చర్యలపై సమగ్ర వివరణ ఇచ్చారు.
దాదాపు వెయ్యేళ్ల వీరగాథ, ఆదివాసీ జాతి వారసత్వ సంపదకు అద్దం పట్టేలా చేపట్టిన మేడారం వనదేవతల గద్దెల ప్రాంగణ పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. రాతి ప్రాకారాలు, శిలాతోరణాలతో సంప్రదాయ వైభవం ఉట్టిపడేలా చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహాజాతర ఆధ్యాత్మికతకు, చరిత్రకు భంగం కలగకుండా అభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
మూలవాసులైన కోయ తెగల ఆచారాలు, సంప్రదాయాలు ప్రతిబింబించేలా రూపుదిద్దుకున్న ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి ఆసాంతం పరిశీలించారు. సుమారు 250 కోట్ల రూపాయల వ్యయంతో గత కొంతకాలంగా శరవేగంగా సాగిన పనులను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మేడారం మహాజాతరను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా నిర్వహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు.