janamvoice.com
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 3:30 pm Digital Edition : JANAM VOICE

ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలి.- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలి.

– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
– ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్’పై ప్రత్యేక దృష్టి.
– ప్రతి నెల గ్రామసభలు, హెల్త్ క్యాంపులకు సూచనలు.
– సంజీవని ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహణ.

జనం వాయిస్, అమరావతి, మార్చి 31:

రాష్ట్ర ప్రజల ఆరోగ్య మెరుగుదలకు అందరూ ఉద్యమంలా కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆరోగ్య పరిరక్షణను సమగ్ర ఉద్యమంగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు అన్ని వర్గాలూ కలిసి పనిచేయాలని సూచించారు. ఏప్రిల్ నెల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లి ఆరోగ్య సమస్యలను గుర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామ, పట్టణ స్థాయిలో ప్రజలకు చేరువై ఆరోగ్య సేవలను అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ప్రతి నెల నాల్గవ శనివారం ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్’ కార్యక్రమం కింద గ్రామసభలు, హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్య సంరక్షణపై సరైన సమాచారం అందించాలని పేర్కొన్నారు.
సంజీవని ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు అమలు, పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులతో చర్చించారు. ఆరోగ్య రంగంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ పాల్గొన్నారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెంపొందించి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయించారు. ప్రజల ఆరోగ్యమే రాష్ట్ర అభివృద్ధికి మూలాధారం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సమగ్ర ఆరోగ్య సంరక్షణ ద్వారా రాష్ట్రాన్ని ఆరోగ్యవంతమైన సమాజంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.