janamvoice.com
Newspaper Banner
Date of Publish : 31 October 2025, 6:09 pm Digital Edition : GATTU MAHESH

అమరావతి రాజధాని నిర్మాణం వేగవంతం చేయాలి

అమరావతి రాజధాని నిర్మాణం వేగవంతం చేయాలి.
– రైతులకు ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
– సీఎం చంద్రబాబు ఆదేశాలు.

జనం వాయిస్,అమరావతి,అక్టోబర్ 31:

రాజధాని అమరావతి అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈరోజు క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన రాజధాని నిర్మాణ పురోగతి, సుందరీకరణ, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ తదితర అంశాలను విపులంగా పరిశీలించారు. ఈ సమావేశంలో మునిసిపల్‌ మరియు పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీఎల్, ఆర్థిక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధికారులు ప్రస్తుత నిర్మాణ పనుల పురోగతి, రోడ్ల నిర్మాణం, నీటి సరఫరా వ్యవస్థలు, భవనాల డిజైన్‌లు వంటి అంశాలపై వివరాలు సమర్పించారు.చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా నిర్దేశించిన సమయానికి పూర్తి కావాలని ఆదేశించారు. పనుల పురోగతిని ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తామని తెలిపారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఆదేశించారు. రైతుల సహకారం అమరావతి అభివృద్ధికి కీలకమని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని సీఎం అన్నారు.
సుందరీకరణ పనులు, రోడ్ల విస్తరణ, గ్రీన్ బెల్ట్‌ అభివృద్ధి వంటి కార్యక్రమాలను వేగవంతం చేస్తే, అమరావతి రూపుదిద్దుకున్న రాజధానిగా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.