janamvoice.com
Newspaper Banner
Date of Publish : 25 December 2025, 11:39 pm Digital Edition : GATTU MAHESH

అటల్ జీ విగ్రహావిష్కరణలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు.

అటల్ జీ విగ్రహావిష్కరణలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు.

– సుపరిపాలన దినోత్సవానికి అటల్ జీ జీవితం ప్రతీక.
– అమరావతి నిర్మాణానికి అటల్ జీ స్ఫూర్తి మార్గదర్శకం.
– ప్రజాసేవలో నిజాయితీ, దూరదృష్టికి పిలుపు.

జనం వాయిస్, అమరావతి, డిసెంబర్ 25:

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని సుపరిపాలన దినోత్సవంగా పాటించడం ఆయన జీవిత విలువలకు తగిన గౌరవమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అటల్ జీ 101వ జయంతి సందర్భంగా అమరావతి సమీపంలోని వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన అటల్ జీ విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అటల్ జీ జీవితం సుపరిపాలనకు, ప్రజాసేవకు ఒక జీవంత మార్గదర్శకమని పేర్కొన్నారు. నిజాయితీ, వినయం, దూరదృష్టి వంటి విలువలను ఆచరణలో చూపిన నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి అని గుర్తు చేశారు. ఆయన ఆశయాలు, ఆదర్శాలు తరతరాలకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు.

రాజధాని అమరావతి నిర్మాణంలో అటల్ జీ స్ఫూర్తి ఎప్పటికీ దారిదీపమని ముఖ్యమంత్రి తెలిపారు. వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన అటల్ జీ విగ్రహం సుపరిపాలన, ప్రజాహిత పాలనకు శాశ్వత ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.అటల్ జీ జీవితం, ఆయన బోధనలు ప్రజాసేవలో నిబద్ధత, కరుణ, దూరదృష్టితో పని చేయాలని ప్రతి ఒక్కరికీ సందేశం ఇస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశాభివృద్ధికి అంకితంగా పనిచేయడమే అటల్ జీకి నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.