janamvoice.com
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 8:40 am Digital Edition : JANAM VOICE

“నా దేశం – నా బాధ్యత” నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా పొదుపు చర్యలు.

  • “నా దేశం – నా బాధ్యత” నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా పొదుపు చర్యలు.
  • – అంతర్జాతీయ సంక్షోభాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయాలు.
  • – ఇంధన పొదుపు, సౌర విద్యుత్, నానో యూరియాపై ప్రత్యేక దృష్టి.
  • జనం వాయిస్, అమరావతి:

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. “నా దేశం – నా బాధ్యత” అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఇంధన దిగుమతులు, విదేశీ మారక ద్రవ్యంపై తీవ్ర ఒత్తిడి పడుతోందని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కూడా ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉందని వివరించారు. ఈ పరిస్థితులను ముందుగానే ఎదుర్కొనేందుకు సమాజాన్ని సిద్ధం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పొదుపు చర్యలు ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను తగ్గించుకోవాలని సూచించారు. అనవసర విదేశీ పర్యటనలను పూర్తిగా రద్దు చేసుకోవాలని పేర్కొన్నారు. సమీప ప్రాంతాలకు వెళ్లేటప్పుడు నడక, సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు. ప్రతి శుక్రవారం “నో వెహికల్ డే” పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు వాహనాల వినియోగాన్ని తగ్గించి వర్చువల్ సమావేశాలు నిర్వహించాలని సూచించింది. అధికారులు వాహనాలను షేర్ చేసుకోవడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఇంధన వినియోగంపై వారానికోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. విదేశీ పర్యటనలకు బదులుగా స్వదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సూచించింది. బంగారం కొనుగోళ్లపై అధిక ఆసక్తిని తగ్గించుకోవాలని, దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని పేర్కొన్నారు. “స్టెప్ ఫర్ ది నేషన్” పేరుతో నడక, సైకిల్ వినియోగంపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంధన రంగంలో శిలాజ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించేందుకు పీఎం సూర్యఘర్ పథకం, పీఎం కుసుమ్ పథకం వంటి సౌర విద్యుత్ పథకాల అమలును వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుపై కూడా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించేందుకు రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు మంత్రి తెలిపారు. అధికంగా యూరియా వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటోందని పేర్కొన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. డ్రోన్ల సహాయంతో నానో యూరియాను సమానంగా పిచికారీ చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఈ చర్యలు ప్రజలను భయపెట్టడానికి కాదని, భవిష్యత్తు సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధత మాత్రమేనని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి త్వరలోనే భారీ పెట్టుబడులు రానున్నాయని, ఇతర మార్గాల్లో ఆదాయ వృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.