సొంతూరులో సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు.
కుటుంబ సభ్యులతో కలిసి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
హెలికాప్టర్‌లో చేరుకున్న సీఎంకు ఘన స్వాగతం.
జనం వాయిస్, నాగర్‌కర్నూల్, అక్టోబర్ 20:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగ వేడుకలను తన సొంత గ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. మంగళవారం హెలికాప్టర్‌లో గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించిన సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న రేవంత్ రెడ్డి దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని స్వగ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి సాయంత్రం గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం గ్రామంలోని మైసమ్మ ఆలయం వద్ద నిర్వహించే సంప్రదాయ జమ్మి చెట్టు పూజలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది.