janamvoice.com
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 5:57 pm Digital Edition : JANAM VOICE

కవిత టీఆర్ఎస్ పార్టీ పేరుపై వివాదం.

కవిత టీఆర్ఎస్ పార్టీ పేరుపై వివాదం.

కొత్త పార్టీకి అడ్డంకులు.
ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు.
ఉత్కంఠ రేపుతున్న పేరు.

జనం వాయిస్, హైదరాబాద్, జూన్ 11:

కవిత ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఆరంభంలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్టీకి టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామాన్ని వినియోగించాలన్న ప్రతిపాదనపై వివాదం చెలరేగడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పేరును ఇతర రాజకీయ సంస్థలకు కేటాయించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి పలు అభ్యంతరాలు చేరుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో భారత్ రాష్ట్ర సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ఉద్యమ చరిత్రతో ముడిపడి ఉందని, ఉద్యమ కాలం నుంచి ప్రజల భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలు తమ పార్టీని టీఆర్ఎస్ పేరుతోనే గుర్తిస్తున్నారని వాదిస్తూ, ఆ పేరును మరో రాజకీయ సంస్థకు కేటాయించరాదని ఎన్నికల సంఘాన్ని కోరింది.
ఇదిలా ఉండగా, కవిత పార్టీ ప్రకటనకు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన తెలంగాణ రాష్ట్రసామాజిక సేన అనే సంస్థ కూడా టీఆర్ఎస్ సంక్షిప్త నామం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ పేరుపై పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ప్రజల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి చేరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పత్రికల్లో వచ్చిన ప్రకటనల ఆధారంగా వందల సంఖ్యలో అభ్యంతర పత్రాలు ఎన్నికల సంఘానికి అందినట్లు సమాచారం. దీంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే తెలంగాణ రాజ్య సమితి పేరుతో నమోదైన మరో రాజకీయ పార్టీ కూడా టీఆర్ఎస్ సంక్షిప్త నామం వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎన్నికల సంఘం దృష్టికి తమ వాదనలను తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత తరఫు ప్రతినిధులు త్వరలో ఎన్నికల సంఘాన్ని కలిసి తమ వాదనలను వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకే పేరుపై వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో తెలంగాణ రక్షణ సేనకు టీఆర్ఎస్ సంక్షిప్త నామం దక్కుతుందా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.