రెచ్చిపోతున్న పశువుల దొంగలు.
-ఆవులకు మత్తు పదార్థాలు పెట్టి దోపిడీ.
-ఆందోళనలో పశువుల రైతులు.
జనం వాయిస్,వెల్గటూర్, జగిత్యాల :
జగిత్యాల జిల్లా వెల్గటూర్ ఉమ్మడి మండలంలో పశువుల దొంగలు రెచ్చిపోతున్నారు.శనివారం అర్ధరాత్రి దాటాక హైవే రోడ్డు పక్కన గల ఇండ్లను టార్గెట్ చేసి పశువులకు అర్ధరాత్రి మత్తుమందిచ్చి ఎత్తుకెల్లిన ఘటన వెల్గటూర్ మండలంలో సంచలనం రేపింది.అర్ధరాత్రి దాటాక దొంగలు డైరెక్ట్ గా ఇంటికి వచ్చి కొట్టాల్లో కట్టేసిన పశువులను ఎత్తుకెళ్లటంతో రైతులు,పశుపోషకులు తీవ్రమైన బయాందోళకు గురవుతున్నారు.వెల్గటూర్ ఉమ్మడి మండలంలోని రాష్ట్ర రహదారి పక్కనున్న కొత్తపేట, శాకాపూర్ గ్రామాల్లోని ముగ్గురు రైతుల ఇంటి పరిసరాల్లోని 4 ఆవులు, ఒక ఎద్దును ఎర్టిగా, ఇన్నోవా లాంటి వాహనాల్లో వచ్చి ఎత్తుకెళ్లారని రైతులు తెలుపుతున్నారు. దొంగలు పశువులను ఎత్తుకుపోయే ముందు తెలివిగా వాటికి మత్తుమందు కలిపిన బ్రెడ్ తినిపించినట్లు రైతులు పేర్కొంటున్నారు.సుమారుగా రూ.2 లక్షల విలువ చేసే పశువులు రెండు గ్రామాల్లో నుంచి మాయం అయినట్లు రైతులు ఆవేదన చెందారు.అయితే శాకాపూర్ గ్రామంలో దొంగలు అర్ధరాత్రి అవులేగను కారులో ఎక్కిస్తున్న క్రమంలో లేగదూడ అరుపులు విని రైతు బయటకు వచ్చి లేచి చూడగా అప్పటికే వాహనం వేగంగా వెళ్ళిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా తక్షణమే వారు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి రైతులను వెంటబెట్టుకొని అదే రాత్రి హైవే వెంట పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ సమీపంలోని ఉడుంపూర్లో ఆదివారం పశువుల అంగడి కావటంతో పోలీసులు అక్కడికి కూడా వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికీ హైవే దొంగల ఆచూకీ మాత్రం లభ్యం కావటం లేదు. రాత్రిళ్ళు పశువులను దొంగలు ఎత్తుకెళ్తున్నారని తెలిసి పశుపోషకులు తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే జగిత్యాల వెల్లే రోడ్డు పక్కన రైస్ మిల్లు వద్ద షెడ్ లో నిలువ చేసిన రంగు లస్మయ్యకు చెందిన 11 బస్తాల పత్తిని ఇదే రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లటం విశేషం.