janamvoice.com
Newspaper Banner
Date of Publish : 30 November 2025, 8:29 pm Digital Edition : GATTU MAHESH

ఐబొమ్మ వ్యవహారంపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు.

ఐబొమ్మ వ్యవహారంపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు.

“నేనూ ఐబొమ్మలో సినిమాలు చూశాను” నారాయణ వెల్లడి.
-వ్యవస్థలో లోపాలే రవి లాంటి వారిని సృష్టిస్తున్నాయన్న విమర్శ.
-సినిమా మాఫియానే అసలు సమస్య,వ్యక్తిని శిక్షించడం కాదని అభిప్రాయం.

జనం వాయిస్, డెస్క్:

ఐబొమ్మ వెబ్‌సైట్‌పై జరుగుతున్న చర్చల మధ్య సీపీఐ అగ్రనేత కె. నారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఐబొమ్మ రవిని శిక్షించడం పరిష్కారం కాదని, అసలు సమస్య సినిమా మాఫియా చేతుల్లోనే ఉందని ఆయన పేర్కొన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాను కూడా ఐబొమ్మలో సినిమాలు చూశానని బహిరంగంగా ఒప్పుకోవడం సంచలనంగా మారింది. సినిమా టికెట్ ధరలను రూ.600–700కు పెంచడం ప్రజలను ఆన్‌లైన్‌ పైరసీ వైపు నెడుతున్న ముఖ్యమైన కారణమని నారాయణ విమర్శించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి సినిమాలు తీసిన తర్వాత ప్రజల జేబులను ఖాళీ చేసే విధంగా టికెట్ ధరలు పెరగడం అన్యాయమని అన్నారు. “సామాన్యుల డబ్బు దోచుకునే పెద్దలపై చర్యలు తీసుకోకుండా ఒక ఐబొమ్మ రవిని మాత్రమే జైలుకి పంపితే ఏం మారుతుంది?” అని ఆయన ప్రశ్నించారు. వ్యవస్థలోని లోపాలే రవి లాంటి వారిని తప్పుడు మార్గాల్లోకి నెడుతున్నాయని నారాయణ అభిప్రాయపడ్డారు. ఒకరిని శిక్షించడం వల్ల సమస్య ముగియదని, సమస్యలను సృష్టించే మూల కారకులు సినిమా మాఫియా, ధరల నియంత్రణలోని లోపాలు మారాలి అని పేర్కొన్నారు. “ఒక రవిని జైలులో పెట్టితే మరో వంద మంది వస్తారు. హిడ్మాను చంపితే వెయ్యి మంది పుడతారు. సమస్య వ్యక్తుల్లో కాదు, వ్యవస్థలో ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తులను శిక్షించడం కంటే వ్యవస్థను సరిదిద్దడం తప్పనిసరి అని సీపీఐ నేత స్పష్టం చేశారు. ధరల నియంత్రణ, పారదర్శకత, వినియోగదారుల రక్షణ వంటి విషయాలు పాటించనంత కాలం ఇలాంటి వ్యక్తులు పుట్టుకొస్తూనే ఉంటారని నారాయణ హెచ్చరించారు. సినీ పరిశ్రమలో మాఫియా వ్యవస్థ కొనసాగడం సమస్యకు మూలమని, దాన్ని నివారించకపోతే భవిష్యత్తులో విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన అన్నారు.