janamvoice.com
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 3:28 pm Digital Edition : GATTU MAHESH

సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇవి తప్పక పాటించాలి<br>

సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇవి తప్పక పాటించాలి.

జనం వాయిస్, డెస్క్:

ప్రతి నెల ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు సమయానికి చెల్లిస్తున్నా కూడా చాలామందిలో సిబిల్ స్కోర్ 500 లేదా 600 దగ్గరే ఆగిపోతోంది. దీంతో కొత్త లోన్లు, క్రెడిట్ కార్డులు రావడం కష్టమవుతోంది. అసలు సమస్య చెల్లింపుల్లో మాత్రమే కాకుండా మనకు తెలియకుండా జరుగుతున్న కొన్ని చిన్న పొరపాట్లలో దాగి ఉంది. అవే సిబిల్ స్కోర్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.ముఖ్యంగా గడువు దాటాక చెల్లింపులు చేయడం పెద్ద నష్టం చేస్తుంది. ఒక రోజు ఆలస్యం అయినా సరే అది ఆలస్య చెల్లింపుగా రికార్డుల్లో నమోదు అవుతుంది. ఇది స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనిని నివారించాలంటే ఆటో డెబిట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం ఉత్తమం.
క్రెడిట్ కార్డు వినియోగం కూడా చాలా కీలకం. మీ కార్డు లిమిట్ లక్ష ఉంటే అందులో 70 వేల నుంచి 80 వేల వరకు ఖర్చు చేస్తుంటే, మొత్తం బిల్లు కట్టినా కూడా బ్యాంకులు మిమ్మల్ని ఆర్థిక ఒత్తిడిలో ఉన్న కస్టమర్‌గా భావిస్తాయి. లిమిట్‌లో 30 శాతం లోపే వినియోగం ఉంచుకుంటే స్కోర్ వేగంగా మెరుగుపడుతుంది.
గతంలో ఏదైనా లోన్‌ను పూర్తిగా చెల్లించలేక బ్యాంకుతో సెటిల్‌మెంట్ చేసుకుంటే అది రిపోర్ట్‌లో సెటిల్డ్‌గా కనిపిస్తుంది. దీని వల్ల భవిష్యత్తులో లోన్లు పొందడం కష్టమవుతుంది. పాత బకాయిలను పూర్తిగా క్లియర్ చేసి నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
ఇంకొక ప్రధాన కారణం పదే పదే లోన్ లేదా కార్డు కోసం దరఖాస్తు చేయడం. ప్రతి దరఖాస్తుతో బ్యాంక్ మీ క్రెడిట్ వివరాలను పరిశీలిస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ దరఖాస్తులు చేస్తే, డబ్బు అత్యవసరంగా అవసరమన్న భావన బ్యాంకులకు కలుగుతుంది. ఇది స్కోర్‌ను మరింత తగ్గిస్తుంది.
ఈ చిన్న విషయాలను జాగ్రత్తగా పాటిస్తే, 500 లేదా 600 దగ్గర ఆగిపోయిన సిబిల్ స్కోర్ క్రమంగా మెరుగుపడి 750 దాకా చేరే అవకాశం ఉంటుంది. సరైన ఆర్థిక క్రమశిక్షణే మంచి సిబిల్ స్కోర్‌కు మూలం అని నిపుణులు చెబుతున్నారు.