మేడారం జాతరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించండి.
– ఉపాధ్యాయ సంఘాల వినతి.
జనం వాయిస్, తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే కుంభమేళా ప్రసిద్ధిగాంచిన గిరిజన పండుగ మేడారం జాతర సందర్భంగా రాష్ట్రవ్యాప్తం గా మూడు రోజులు పాఠశాలలకు, ఉద్యోగులకు అధికారిక సెలవులు ప్రకటించాలని పిఆర్టియు, ఉపాధ్యాయ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి సంవత్సరం కోట్లాదిమంది భక్తులు హాజరయ్యే ఈ మహా జాతరకు ఉద్యోగులు విద్యార్థులు మేడారం వెళ్లేందుకు సెలవులు అవసరమని వారు పేర్కొన్నారు.
మేడారం జాతర నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. జనవరి 28 నుంచి 31 వరకు ఈ మేడారం జాతర జరుగుతుంది. తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు మేడారం జాతరకు తరలివస్తారు. ఈ సమయంలో రహదారులు, బస్సులు, రైళ్లు భక్తులతో కిక్కిరిసిపోతాయి.
సమ్మక్క–సారలమ్మ గిరిజన దేవతల జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరలలో ఒకటిగా గుర్తింపు పొందింది. భక్తులు మొక్కులు చెల్లించడం, బంగారం సమర్పించడం, ప్రత్యేక పూజలు నిర్వహిం చడం ఈ జాతరలో ప్రధాన ఆకర్షణలు. అడవుల నడుమ జరిగే ఈ జాతరకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది.
ఈ నేపథ్యంలో మేడారం జాతర సందర్భంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని పీర్టీయూ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే జరిగితే మరోసారి విద్యార్థులకు వరుసగా 2,3 రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది!అలాగే మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కూడా వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మరి మేడారం జాతర సందర్భంగా సెలవులను ప్రకటించాలనే డిమాండ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.