న్యాయవ్యవస్థను బెదిరించే ప్రయత్నమే.-తీవ్రంగా మండిపడ్డ పవన్ కల్యాణ్.
-హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన యత్నం పట్ల ఆగ్రహం.
-సెక్యులరిజం పేరుతో న్యాయపరమైన జోక్యం పెరుగుతోందని విమర్శ.
-న్యాయ స్వతంత్రతకు రక్షణ అవసరమని పిలుపు.
జనం వాయిస్,అమరావతి,డిసెంబర్ 09:
న్యాయమూర్తులపై అభిశంసన ప్రతిపాదనలు రాజకీయ కోణంలో వస్తున్నాయంటే అది న్యాయవ్యవస్థను భయపెట్టే ప్రయత్నమే అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,జనసేనాధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సంప్రదాయాలకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిపై 120 మందికిపైగా ఎంపీలు అభిశంసన నోటీసులు ఇవ్వడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆందోళన కలిగించే పరిణామమని స్పష్టం చేశారు.శబరిమల విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో దేశవ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయని గుర్తుచేసిన పవన్ కల్యాణ్, అప్పట్లో ఏ న్యాయమూర్తిపైనా అభిశంసన ప్రతిపాదన రాకపోవడం గమనార్హమని సూచించారు.తీర్పు పై పునఃపరిశీలన మాత్రమే జరిగిందనీ, న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకోవడం జరగలేదనీ వివరించారు.అయితే, ఇప్పుడు హిందూ భక్తుల సంప్రదాయాలను కాపాడే తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతోందని విమర్శించారు.భారత రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తులను తొలగించాలంటే దృఢమైన ఆధారాలతో నిరూపణ అవసరమని, ఒక తీర్పు నచ్చలేదనే కారణంతో ఇంపీచ్‌మెంట్ ప్రయత్నాలు చేయడం అత్యంత ప్రమాదకర సంకేతమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ చర్యలతో న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకురానే కాకుండా, భవిష్యత్తులో హిందూ సంప్రదాయాలకు సంబంధించిన కేసుల్లో తీర్పులు ఇవ్వడంపై ప్రభావం చూపే అవకాశముందని హెచ్చరించారు.న్యాయ స్వతంత్రతను రక్షించే బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని పేర్కొన్న పవన్ కల్యాణ్, మతపరమైన వ్యవహారాలు రాజకీయ జోక్యం లేకుండా సాగాలంటే సనాతన ధర్మ రక్షణ బోర్డు అవసరమని అభిప్రాయపడ్డారు.ఆలయాల నిర్వహణను భక్తుల చేతుల్లో ఉంచడం ద్వారా వివాదాలు, రాజకీయ జోక్యాలు తగ్గి సమాజంలో శాంతి నెలకొంటుందని అన్నారు.