ఆలోచనల మార్పు దిశగా “మైండ్‌సెట్ షిఫ్ట్”.
-పుస్తక రచయిత శరాణి పొంగూరును అభినందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
జనం వాయిస్,హైదరాబాద్,అక్టోబర్ 31:
జీవితాన్ని సానుకూల దిశగా మలిచే ఆలోచనలను ప్రేరేపించే “మైండ్‌సెట్ షిఫ్ట్” (Mindset Shift) పుస్తకాన్ని రచించిన శరాణి పొంగూరును ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రచయిత శరాణి పొంగూరు పవన్ కళ్యాణ్‌ను కలసి పుస్తక ప్రతిని అందజేశారు.“మైండ్‌సెట్ షిఫ్ట్” పుస్తకం ద్వారా రచయిత కృతజ్ఞత, స్వీయ అవగాహన, సానుకూల అలవాట్లు, ఆత్మవిశ్వాసం వంటి అంశాలను పాఠకుల్లో నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. ఈ పుస్తకం ముఖ్యంగా యువతలో ఆలోచనల్లో స్పష్టత, జీవితంలో సమతుల్యత, సానుకూల దృక్పథం పెంపొందించేందుకు దోహదం చేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు.అలాగే, రచయిత రూపొందించిన “మైండ్‌సెట్ షిఫ్ట్ వర్క్‌బుక్” ద్వారా పాఠకులు తమ ఆలోచనలను ఆచరణలోకి తేవడానికి ఉపయోగపడే మార్గదర్శనం అందిందని పేర్కొన్నారు. ఈ తరహా రచనలు నేటి వేగవంతమైన ప్రపంచంలో యువతకు మానసిక బలం, ధైర్యం, దిశానిర్దేశం కలిగించగలవని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా రచయిత శరాణి పొంగూరు మాట్లాడుతూ.. “నా పుస్తకం ద్వారా పాఠకులు తమలోని ఆలోచనా మార్పును గుర్తించాలి, చిన్న అలవాట్లతో పెద్ద మార్పులు సాధ్యమవుతాయి అనే నమ్మకం నాలో ఉంది” అని తెలిపారు.కార్యక్రమం అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శరాణి పొంగూరును అభినందిస్తూ, “యువతలో చైతన్యపూర్వక జీవన విధానాన్ని ప్రేరేపించే ఈ ప్రయత్నం అభినందనీయం” అన్నారు.