పేదోడి ప్రాణం ఖరీదు 7.50 లక్షలు.-పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేటలో విద్యుత్ షాక్‌తో గోర్రెల కాపరి మృతి. .
-బాధ్యులపై కేసులు పెట్టాలని రాజ్యాధికార పార్టీ డిమాండ్.
జనం వాయిస్, పెద్దపల్లి :
పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలోని పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామంలో జరిగిన విషాద ఘటన స్థానిక ప్రజలను కలచివేసింది.శుక్రవారం ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో దాగేటి మల్లేష్ యాదవ్ (31)లు గోర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్న ఈ నిరుపేద యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు.ప్రాంత ప్రజల కథనం ప్రకారం,మల్లేష్ గోర్రెలను మేపుతుండగా, సమీపంలో ఉన్న ఇటుక బట్టిల వద్ద విద్యుత్ లీకేజ్ కారణంగా అతను అక్కడికక్కడే మృతిచెందాడు.ఈ ఘటనకు సంబంధించి విద్యుత్ శాఖ, ఇటుక బట్టిల యాజమాన్యం నిర్లక్ష్యం కారణమని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండవేణ స్వామి తీవ్రంగా స్పందిస్తూ, “ఒక పేదోడి ప్రాణం ఖరీదు కేవలం 7.50 లక్షలుగా నిర్ణయించడం అన్యాయం.

మల్లేష్ యాదవ్ మరణానికి కారణమైన విద్యుత్ శాఖ అధికారులపై, బట్టిల యాజమాన్యంపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆయనతో పాటు పార్టీ నాయకులు బోంకురి దుర్గయ్య (బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ అధ్యక్షులు), సాతురి అనిల్ (ప్రధాన కార్యదర్శి) బాధిత కుటుంబాన్ని పరామర్శించి, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.ఉదయం చనిపోయిన వ్యక్తి రాత్రి అయ్యే వరకు ఎవరూ పట్టించుకోలేదని బాధ్యులను రక్షించేందుకు,బాధిత కుటుంబాన్ని బెదిరించి బేరాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దారుణం, అమానుషం” అని ఆరోపించారు.స్థానిక ప్రజలు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల పేద ప్రజలు బలైపోతున్నారు.ఒక్క నిరుపేద ప్రాణం విలువ కేవలం డబ్బుగా మార్చకూడదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.మల్లేష్ యాదవ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించినట్టు సమాచారం.