janamvoice.com
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 9:35 am Digital Edition : JANAM VOICE

పింఛన్ కోసం కాళ్ళు మొక్కిన దివ్యాంగులు.

పింఛన్ కోసం కాళ్ళు మొక్కిన దివ్యాంగులు.

దివ్యాంగుల పింఛన్లు నిలిపివేతపై ఆగ్రహం.

ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇద్దరి ఆత్మహత్యాయత్నం.

కాంగ్రెస్ సర్పంచ్ తమపై కక్ష సాధిస్తున్నారని బాధితుల ఆరోపణ.

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఘటన.

జనం వాయిస్, ముత్తారం, సెప్టెంబర్ 16:

ఆసరాగా నిలవాల్సిన పింఛనే దివ్యాంగుల పాలిట ప్రాణసంకటంగా మారిన ఘటన ముత్తారం మండలంలో కలకలం రేపింది. ఎన్నికల్లో సహకరించలేదన్న కారణంతో తమకు వస్తున్న పింఛన్లు నిలిపివేశారని ఆరోపిస్తూ ఇద్దరు దివ్యాంగులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది.
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన సూరం రాజబాబు, పెద్దపల్లి సత్తయ్య ల దివ్యాంగుల పింఛన్లు ఇటీవల నిలిచిపోయాయి. దీంతో బాధితులు పలుమార్లు అధికారులను ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్‌పై ఆధారపడి జీవిస్తున్న తమకు నెలల తరబడి పింఛన్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
ఈ క్రమంలో బుధవారం ముత్తారం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్న బాధితులు.. పింఛన్ ఎందుకు నిలిపివేశారని అధికారులను ప్రశ్నించారు. తమ చేతుల్లో ఏమీ లేదని అధికారులు చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు దివ్యాంగులు కార్యాలయ భవనం పైకి ఎక్కి పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యకు యత్నించారు. అయితే గ్రామస్తులు వారిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సర్పంచ్‌పై తీవ్ర ఆరోపణలు.

తమకు పింఛన్ రాకుండా గ్రామ సర్పంచ్ తాని ప్రభాకర్ అడ్డుకుంటున్నారని బాధితులు ఆరోపించారు. ఎన్నికల్లో సహకరించలేదన్న కారణంతో తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు వాపోయారు. అయితే ఈ ఆరోపణలపై సర్పంచ్‌ వైపు వివరణ తెలియాల్సి ఉంది.

ఎంపీడీవో కార్యాలయం ముట్టడి.

ఘటనతో ఆగ్రహించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. పింఛన్లు తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు వెంటనే పింఛన్లు పునరుద్ధరించాలని కోరారు.

అధికారుల హామీతో ఆందోళన విరమణ.

అయితే ఇద్దరు దివ్యాంగులు అధికారుల కాళ్ళ మీద పడి వేడుకున్నారు. కార్యాలయ సూపరింటెండెంట్ సురేష్ బాధితులతో మాట్లాడి పింఛన్లు పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.
పింఛన్‌ కోసం అర్హులైన దివ్యాంగులు కార్యాలయాల చుట్టూ తిరిగి చివరకు ఆత్మహత్యకు యత్నించే పరిస్థితి రావడం అధికార యంత్రాంగం తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. పింఛన్ల నిలిపివేతకు అసలు కారణమేంటి? ఎవరి ఆదేశాలతో నిలిపివేశారు? అర్హులైన వారి పింఛన్లను తక్షణమే పునరుద్ధరిస్తారా? అన్న ప్రశ్నలకు అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.