janamvoice.com
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 7:26 pm Digital Edition : JANAM VOICE

కొండగట్టు ఆంజన్న ఆలయంలో అపశ్రుతి.

కొండగట్టు ఆంజన్న ఆలయంలో అపశ్రుతి.

పందిరి కూలి 15 మందికి గాయాలు.
హనుమాన్ చిన్న జయంతి వేడుకల్లో ఘటన.
నాసిరకం ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం.
భద్రతా చర్యలపై ప్రశ్నలు వెల్లువ.

జనం వాయిస్, జగిత్యాల, ఏప్రిల్ 1:

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజన్న ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయం పరిసరాల్లో ఏర్పాటు చేసిన చలువ పందిరి అకస్మాత్తుగా కూలిపోవడంతో కనీసం 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న భక్తుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాల కోసం పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. హనుమాన్ మాల విరమణ కోసం వేలాదిగా వచ్చిన భక్తుల రద్దీ మధ్య ఈ ఘటన చోటుచేసుకోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.
భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు, చలువ పందిళ్లు వంటి ఏర్పాట్లు చేసినప్పటికీ, పందిరి నాసిరకంగా ఏర్పాటు చేయడంతోనే కూలిపోయిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వేసిన ఈ పందిరి భద్రతా ప్రమాణాలను పాటించలేదని వారు విమర్శిస్తున్నారు. పందిరి కూలిపోవడంతో గాయపడిన భక్తులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. వైద్యులు వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాల సమయంలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆక్షేపిస్తున్నారు. ఆలయ నిర్వహణలో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే అభ్యర్థనలు వినిపిస్తున్నాయి.