చిల్లర కోసం చెలరేగిన వివాదం.. తీవ్రంగా గాయపడిన ఆర్టీసీ కండక్టర్.
కదులుతున్న బస్సులో నుంచి నెట్టివేసినట్లు ఆరోపణలు
బస్సు చక్రాల కింద నలిగిన కాళ్లు.. ప్రయాణికురాలిపై కేసు నమోదు
చిల్లర వివాదం.. మహిళా కండక్టర్ ప్రాణాల మీదకు!
జనం వాయిస్, భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 26:
బస్సులో టికెట్ చిల్లర విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఓ మహిళా కండక్టర్ ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రయాణికురాలితో జరిగిన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో కదులుతున్న ఆర్టీసీ బస్సులో నుంచి మహిళా కండక్టర్ కిందపడిపోయి తీవ్రంగా గాయపడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో మౌనిక అనే మహిళ తన కుమారుడితో కలిసి ప్రయాణిస్తోంది. కుమారుడికి హాఫ్ టికెట్ తీసుకునేందుకు కండక్టర్ ప్రవళికకు రూ.100 నోటు ఇచ్చింది. టికెట్ తీసుకున్న అనంతరం మిగిలిన చిల్లర డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. చిల్లర అందుబాటులో లేకపోవడంతో కొంతసేపటి తర్వాత తీసుకోవాలని కండక్టర్ సూచించగా, వెంటనే ఇవ్వాలని ప్రయాణికురాలు పట్టుబట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో మిట్టగూడెం వద్ద వివాదం మరింత ముదిరింది. పోలీస్ స్టేషన్ వద్ద బస్సును ఆపాలని కండక్టర్ భావించిన సమయంలో ప్రయాణికురాలు ఆమెను నెట్టివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కదులుతున్న బస్సు నుంచి కిందపడిన ప్రవళిక కాళ్లపై నుంచి బస్సు వెనుక చక్రాలు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి ప్రయాణికులు, స్థానికులు ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై అశ్వాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికురాలు మౌనికను అదుపులోకి తీసుకుని విచారించారు. మరోవైపు తాను ఉద్దేశపూర్వకంగా నెట్టలేదని, కండక్టర్ ప్రమాదవశాత్తూ కిందపడిందని మౌనిక చెబుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. మహిళా కండక్టర్‌పై జరిగిన ఘటనను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, గాయపడిన కండక్టర్‌కు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు సైతం ఘటనను ఖండిస్తూ విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశాయి. చిల్లర డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం ఓ ఉద్యోగిని తీవ్ర గాయాలపాలు చేయడం ఆర్టీసీ సిబ్బంది భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. ప్రయాణికులు, సిబ్బంది మధ్య సమస్యలు తలెత్తినప్పుడు సంయమనంతో పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.