అప్పుల భారానికి ప్రాణాలు అర్పించకండి… సమాజానికి హెచ్చరికగా మారిన విషాద ఘటన.
జనం వాయిస్, వెబ్ డెస్క్:
మహబూబ్ నగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఒక దంపతులు ఆత్మహత్యకు యత్నించగా, ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన దంపతులు తమ చిన్న పసిబిడ్డను పొలంలో ఉన్న ఉయ్యాలలో వదిలి, సమీపంలోని చెట్టుకు ఉరివేసుకున్నారు.
ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. పొలంలో ఉయ్యాలలో ఒంటరిగా ఉన్న శిశువును గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. అప్పుల ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఈ దంపతులు ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ విషాద ఘటన సమాజానికి ఒక గాఢమైన సందేశాన్ని ఇస్తోంది. అప్పులు, ఆర్థిక సమస్యలు ఎంత పెద్దవైనా ప్రాణాల కంటే విలువైనవి కావు. సమస్యలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం లేదా అధికారులను ఆశ్రయించడం ద్వారా పరిష్కారం కనుగొనవచ్చు. ఒక క్షణిక నిర్ణయం వెనుక ఒక కుటుంబం, ముఖ్యంగా అమాయక పిల్లల భవిష్యత్తు చీకటిలో మిగిలిపోతుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతో సమస్యలు ఎంత పెద్దవైనా ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని సమాజానికి సంకేతం ఇస్తున్న మా డైనమిక్ జనం వాయిస్ న్యూస్ తరపున ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని, సమస్యలకు మార్గం వెతుక్కోవాలని మనవి చేస్తున్నాము.