janamvoice.com
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 11:38 am Digital Edition : JANAM VOICE

ఆమెతో వివాహేతర బంధం.. దంపతులను చంపి పూడ్చిపెట్టిన కానిస్టేబుల్‌.

ఆమెతో వివాహేతర బంధం.. దంపతులను చంపి పూడ్చిపెట్టిన కానిస్టేబుల్‌.

జనం వాయిస్, సూర్యాపేట, ఆగష్టు 16:

సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసిన ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కుమార్తె పంచాయితీ విషయమై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భార్యాభర్తలతో పరిచయం పెంచుకున్న ఓ పోలీస్ కానిస్టేబుల్, వివాహేతర సంబంధం, అప్పుల వివాదం నేపథ్యంలో ఆ దంపతులను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం బిక్యాతండాకు చెందిన హలావత్ నాగులు (48), బూబా (41) దంపతులు మండల కేంద్రంలో వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని జీవిస్తున్నారు. వీరి కుమార్తె కుటుంబ కలహాల కారణంగా నాగులు, బూబా తరచూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లేవారు.
ఈ క్రమంలో బూబాకు అక్కడ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎండీ షరీఫ్‌తో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ సమయంలో అల్లుడికి డబ్బులు ఇవ్వాల్సి రావడంతో బూబా.. షరీఫ్ వద్ద రూ. 3 లక్షలు అప్పుగా తీసుకుంది. అయితే ఇటీవల షరీఫ్‌కు వేరే యువతితో వివాహం నిశ్చయమైంది. దీంతో తాను ఇచ్చిన అప్పును వెంటనే తిరిగి ఇవ్వాలని బూబాను షరీఫ్ పలుమార్లు డిమాండ్ చేశాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోగా, తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధం విషయాన్ని తన కాబోయే భార్యకు చెబుతానని బెదిరించింది. తన పెళ్లికి ఈ దంపతులు అడ్డంకిగా మారుతారనే కక్షతో వారిని అడ్డు తొలగించుకోవాలని షరీఫ్ పథకం పన్నాడు.
హత్యకు పథకం వేసిన షరీఫ్.. గొర్రెల రుణం ఇప్పిస్తానని బూబాను నమ్మించాడు. బ్యాంకు అధికారులు పరిశీలనకు వస్తారని చెప్పి షెడ్డు, గొర్రెలను సిద్ధం చేయాలని నాగులను కోరాడు. ఈ నెల 11న రాత్రి పది గంటల ప్రాంతంలో షెడ్డు పరిశీలనకు వెళ్లిన సమయంలో, గొర్రెల ఎరువు కోసం తీసిన గుంతను చూపిస్తుండగా షరీఫ్ కర్రతో నాగులుపై తీవ్రంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని గుంతలోనే పూడ్చిపెట్టాడు. ఈ దారుణానికి సహకరించిన సుందర్ అనే వ్యక్తి ద్వారా బూబాను కూడా అక్కడికి రప్పించి, భర్త కనిపించడం లేదని ఆమె కేకలు వేయడంతో అదే కర్రతో ఆమెను కూడా హతమార్చాడు.
మరుసటి రోజు షరీఫ్ యథావిధిగా తన విధులకు హాజరవడం గమనార్హం. హత్యల ఉదంతం బుధవారం వెలుగులోకి రావడంతో, పోలీసు బృందంతో కలిసి స్వయంగా తానే ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు నటించాడు. అయితే సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముందుగా సుందర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. గురువారం సాయంత్రం కొత్త బస్టాండ్ వద్ద నిందితుడు షరీఫ్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసును తక్కువ సమయంలో విజయవంతంగా ఛేదించిన కోదాడ, సూర్యాపేట డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు మరియు ప్రత్యేక బృందాల అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.