janamvoice.com
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 11:49 am Digital Edition : JANAM VOICE

జర్నలిస్టులపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు.

  • జర్నలిస్టులపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు.
  • – తెలంగాణ మాల జర్నలిస్ట్ అసోసియేషన్ హెచ్చరిక.
  • – నిజాలు నిర్భయంగా రాస్తే వ్యక్తిగత దూషణలకు దిగడం వీరన్న నాయక్ అహంకారానికి నిదర్శనం.
  • – జిల్లా సహాయ కార్యదర్శి గండమాల రామకృష్ణ.
  • జనం వాయిస్, కురవి, మే 06:
  • జనం వాయిస్ ఇ-పేపర్ అంటూ .., సీనియర్ జర్నలిస్ట్ జిల్లా ప్రతినిధి బేతమల్ల సహాదేవ్ పై కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వీరన్న నాయక్ చేసిన అనుచిత వ్యాఖ్యలను, తప్పుడు ఆరోపణలను తెలంగాణ మాల జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోంది. బుధవారం ఈ మేరకు అసోసియేషన్ జిల్లా సహాయ కార్యదర్శి గండమాల రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో అధికార పక్షం తప్పులను ఎత్తిచూపడం జర్నలిస్టుల బాధ్యత అని, దాన్ని తట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు దిగడం వీరన్న నాయక్ అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. రాజకీయాల్లో పార్టీలు వేరైనా, ప్రజా అవసరాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలవడం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని, దాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడటం సరికాదన్నారు. ముఖ్యంగా, సహాదేవ్  డబ్బులు అడిగారని వీరన్న నాయక్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని, తన తప్పును కప్పిపుచ్చుకోవడానికే జర్నలిస్టుల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని ధ్వజమెత్తారు. “డబ్బులు శాశ్వతం కాదు, విలువలే శాశ్వతం” అని నీతులు చెబుతున్న నాయకులు, ముందు జర్నలిస్టుల పట్ల గౌరవంగా మెలగడం నేర్చుకోవాలని హితవు పలికారు. అసోసియేషన్ డిమాండ్లు:
  • 1. జర్నలిస్ట్ సహాదేవ్ పై చేసిన ఆరోపణలను వీరన్న నాయక్ వెంటనే నిరూపించాలి, లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.
  • 2. జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
  • 3. క్షమాపణ చెప్పని పక్షంలో వీరన్న నాయక్ తీరుకు నిరసనగా త్వరలోనే భారీ ఎత్తున ‘దీక్ష’ చేపడతామని, పరువు నష్టం దావా కూడా వేస్తామని హెచ్చరించారు.
  • మీడియాపై ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని, ఇలాంటి బెదిరింపులకు జర్నలిస్టులు భయపడబోరని గండమాల రామకృష్ణ స్పష్టం చేశారు.