janamvoice.com
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 4:47 pm Digital Edition : JANAM VOICE

సింగరేణి కార్మికుడి ఇంట్లో అగ్నిప్రమాదం.. రూ.8 లక్షల ఆస్తి నష్టం.

సింగరేణి కార్మికుడి ఇంట్లో అగ్నిప్రమాదం.. రూ.8 లక్షల ఆస్తి నష్టం.

షార్ట్‌సర్క్యూట్ కారణమనే అనుమానం..

నిద్రలోనే అప్రమత్తమై ప్రాణాపాయం నుంచి బయటపడ్డ కార్మికుడు.

జనం వాయిస్, మందమర్రి, జూలై 16:

మందమర్రి ఏరియా స్టేషన్ రోడ్డులోని సింగరేణి క్వార్టర్స్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఓ సింగరేణి కార్మికుడి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. మందమర్రి ఏరియా వర్క్‌షాప్‌లో పనిచేస్తున్న సింగరేణి కార్మికుడు బిల్లా మాధవరెడ్డి రాత్రి షిఫ్ట్ విధులు ముగించుకుని ఇంటికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు స్వగ్రామానికి వెళ్లడంతో ఆయన ఒక్కరే ఇంట్లో ఉన్నారు. నిద్రలో ఉండగా ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి.

దీనిని గమనించిన పక్కింటి వారు వెంటనే మాధవరెడ్డిని అప్రమత్తం చేయడంతో ఆయన సురక్షితంగా బయటకు వచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
సమాచారం అందుకున్న స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చి, నీటితో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే మంటలు తీవ్రరూపం దాల్చి ఇంట్లోని గృహోపకరణాలు, నగదు, బట్టలు, ఇతర విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు. సర్వం కోల్పోయిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని తగిన ఆర్థిక సహాయం అందించాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు.