janamvoice.com
Newspaper Banner
Date of Publish : 08 February 2026, 4:26 pm Digital Edition : GATTU MAHESH

స్వర్ణగిరి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.పరుగులు తీసిన ప్రయాణికులు.

స్వర్ణగిరి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.పరుగులు తీసిన ప్రయాణికులు.

– రాజస్థాన్ జైసల్మేర్ జిల్లాలో ఘటన.

– దట్టమైన పొగతో అప్రమత్తమైన ప్రయాణికులు.

– లోకో పైలట్ వెంటనే రైలు నిలిపివేత.

– ప్రాణనష్టం లేకపోవడంతో ఊరట.

జనం వాయిస్, రాజస్తాన్:

ఇటీవల వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికుల్లో భయాందోళన కలిగిస్తున్న వేళ, తాజాగా స్వర్ణగిరి ఎక్స్‌ప్రెస్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ జిల్లా జేతా–చందన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఢిల్లీ నుంచి వస్తున్న ఈ రైలులో మంటలు చెలరేగాయి. రైలు ప్రయాణంలో ఉండగా ఒక బోగీలో నుంచి దట్టమైన పొగ రావడం గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశారు. సమాచారం అందుకున్న లోకో పైలట్ అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేశారు. రైలు ఆగగానే భయంతో ప్రయాణికులు బోగీల నుంచి బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో పాటు రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయానికి గురయ్యారు. సాంకేతిక లోపమా, లేక ఇతర కారణాలా అన్న అంశంపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల తరచూ రైళ్లలో చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాల నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.