janamvoice.com
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 6:00 pm Digital Edition : JANAM VOICE

సామూహిక పెళ్లి పేరుతో మోసం.

  • సామూహిక పెళ్లి పేరుతో మోసం.
  • 42 మంది వరులకు షాక్.
  • అనాథ యువతుల పేరుతో వల.
  • ప్రధాన నిందితుల అరెస్ట్.
  • జనం వాయిస్, మధ్యప్రదేశ్, మే 27:

మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో సామూహిక వివాహం పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. పెళ్లి కోసం ఆశగా వచ్చిన 42 మంది వరులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆదివారం నిర్వహిస్తామని చెప్పిన వివాహ వేడుకకు చేరుకున్న వారికి అక్కడ వధువులు గానీ, పెళ్లి ఏర్పాట్లు గానీ కనిపించకపోవడంతో తాము మోసపోయామని గ్రహించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం విదిశ జిల్లాకు చెందిన ముఖేశ్, అతని భార్య సునీతా దాస్ బైరాగి నేతృత్వంలోని ముఠా ఈ మోసానికి పాల్పడింది. ఇండోర్‌లోని ఓ ఆశ్రమం నుంచి అనాథ యువతులతో పెళ్లిళ్లు జరిపిస్తామని యువకులను నమ్మించారు. ఒక్కో వరుడి నుంచి రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో వసూలు చేసినట్లు గుర్తించారు.
యువకులను నమ్మించేందుకు ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన మోడల్స్ ఫోటోలను చూపించినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి బట్టలు, ఇతర ఖర్చులన్నీ తామే చూసుకుంటామని చెప్పడంతో చాలామంది వారి మాటలు నమ్మారు. వరులు సాధారణ దుస్తుల్లో వస్తే సరిపోతుందని చెప్పడంతో బాధితులు కుటుంబ సభ్యులతో కలిసి దేవాస్‌కు చేరుకున్నారు. పెళ్లి వేదిక వద్దకు వెళ్లిన తర్వాత అక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో బాధితులు షాక్‌కు గురయ్యారు. నిర్వాహకులు ఎక్కడా కనిపించకపోవడంతో వారిని ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్లు తెలిసింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కార్లు అద్దెకు తీసుకుని దూర ప్రాంతాల నుంచి వచ్చినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితులైన ముఖేశ్, అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మోసానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సామాజిక పరువు పోతుందనే భయంతో చాలా కుటుంబాలు ముందుకు రావడం లేదని పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం 10 కుటుంబాలు మాత్రమే అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్ల కోసం ఎదురుచూస్తున్న యువకుల బలహీనతను ఆసరాగా చేసుకుని ఇలాంటి ముఠాలు మోసాలకు పాల్పడుతున్నాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.