janamvoice.com
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 1:26 pm Digital Edition : JANAM VOICE

సీనియర్‌ సిటిజన్లకు ఉచిత బస్సు పాస్‌లు వెంటనే అమలు చేయాలి.

సీనియర్‌ సిటిజన్లకు ఉచిత బస్సు పాస్‌లు వెంటనే అమలు చేయాలి.

  • మంత్రి పొన్నం ప్రకటనను స్వాగతిస్తున్నాం.
  • దసరా కానుకగా 60 ఏళ్లు నిండిన వారందరికీ పాస్‌లు ఇవ్వాలి.

జనం వాయిస్, ఘట్‌కేసర్, అక్టోబర్‌ 6:

సీనియర్‌ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్సు పాస్‌లు అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించడాన్ని డెమొక్రటిక్‌ సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ స్వాగతించింది. ఈ సౌకర్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే అమలు చేయాలని అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు తోట రంగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆళవందార్‌ వేణు మాధవ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఘట్‌కేసర్‌ సర్కిల్‌ సుప్రభాత్‌ టౌన్‌షిప్‌లో నిర్వహించిన అసోసియేషన్‌ సమావేశంలో వారు మాట్లాడుతూ.. 60 సంవత్సరాలు నిండిన ప్రతి సీనియర్‌ సిటిజన్‌కు ఎలాంటి వివక్ష లేకుండా ఉచిత బస్‌ పాస్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌ 1 నుంచి 4వ తేదీ మధ్య వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన వార్తల ప్రకారం, సీనియర్‌ సిటిజన్లకు ఉచిత బస్‌ పాస్‌లు అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారని తెలిపారు. వృద్ధాప్యంలో వైద్య సేవలు, మందులు, పెన్షన్‌, బ్యాంకు పనులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం వంటి అవసరాల కోసం సీనియర్‌ సిటిజన్లు తరచూ ప్రయాణించాల్సి వస్తుందని పేర్కొన్నారు. పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో బస్సు చార్జీలు కూడా వృద్ధులకు అదనపు ఆర్థిక భారంగా మారుతున్నాయని తెలిపారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు లగ్జరీ, రాజధాని, గరుడ తదితర బస్సుల్లో 50 శాతం రాయితీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న తరహాలోనే, సమాజానికి జీవితాంతం సేవలందించిన వృద్ధులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ప్రభుత్వ సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్వయంగా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించడం సీనియర్‌ సిటిజన్లకు ఆశాజనకంగా ఉందని వారు అన్నారు. ఇది కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాకుండా వృద్ధుల పట్ల ప్రభుత్వ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇక ఆలస్యం చేయకుండా 60 ఏళ్లు నిండిన సీనియర్‌ సిటిజన్లందరికీ దసరా కానుకగా ఉచిత ఆర్టీసీ బస్‌ పాస్‌లు ప్రకటించి, అమలు తేదీని స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ సభ్యులు రాజిరెడ్డి, ఎస్‌.లక్ష్మీనారాయణ, ఎం.సత్యనారాయణ, బంగారి మల్లయ్య, రాసకట్ల పోశం, కొట్టే మల్లయ్య, ఏ.ప్రభాకర్‌, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.