janamvoice.com
Newspaper Banner
Date of Publish : 22 December 2025, 10:54 pm Digital Edition : GATTU MAHESH

వరల్డ్ కప్ ముందు కివీస్‌పై గంభీర్ సేన దండయాత్ర.

వరల్డ్ కప్ ముందు కివీస్‌పై గంభీర్ సేన దండయాత్ర.
– వరుసగా 8 మ్యాచ్‌లకు రంగం సిద్ధం.

జనం వాయిస్, హైదరాబాద్, డిసెంబర్ 22:

దక్షిణాఫ్రికాతో స్వదేశీ సిరీస్‌ను ముగించిన భారత క్రికెట్ జట్టు కొద్ది రోజుల విరామం తర్వాత 2026లో కొత్త ఉత్సాహంతో మైదానంలోకి దిగబోతోంది. కొత్త సంవత్సరంలో తొలి సవాల్‌గా న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్లు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి. మొత్తం ఎనిమిది మ్యాచ్‌లతో కూడిన ఈ సిరీస్ వరల్డ్ కప్‌కు ముందు టీమిండియాకు కీలక పరీక్షగా మారనుంది.2026లో భారత్ ఆడే తొలి అంతర్జాతీయ మ్యాచ్ జనవరి 11న జరగనుంది. వడోదర వేదికగా తొలి వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 16 సంవత్సరాల తర్వాత అక్కడ పురుషుల అంతర్జాతీయ మ్యాచ్ జరగడం విశేషం. ఈ వన్డే సిరీస్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో వన్డే రాజ్‌కోట్‌లో, మూడో వన్డే ఇండోర్‌లో జరగనుంది. వన్డే చరిత్రలో భారత్, న్యూజిలాండ్ జట్లు 120 సార్లు తలపడగా, భారత్ 62 విజయాలు, కివీస్ 50 విజయాలు సాధించాయి.
వన్డే సిరీస్ ముగిసిన వెంటనే జనవరి 21 నుంచి టీ20 సమరం మొదలవుతుంది. ఫిబ్రవరిలో జరిగే టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఇది టీమిండియాకు చివరి సన్నాహక సిరీస్. టీ20ల్లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు జరగగా, భారత్ 14, న్యూజిలాండ్ 10 మ్యాచ్‌లు గెలిచాయి. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో గంభీర్ సేన బరిలోకి దిగనుంది. అన్ని టీ20 మ్యాచ్‌లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి.
భారత్ – న్యూజిలాండ్ పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది. జనవరి 11న వడోదరలో తొలి వన్డే, జనవరి 14న రాజ్‌కోట్‌లో రెండో వన్డే, జనవరి 18న ఇండోర్‌లో మూడో వన్డే జరగనుంది. టీ20 సిరీస్‌లో జనవరి 21న నాగపూర్, జనవరి 23న రాయ్‌పూర్, జనవరి 25న గువహటి, జనవరి 28న విశాఖపట్నం, జనవరి 31న తిరువనంతపురంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. వరుస విజయాలతో ప్రపంచ కప్ ముందు ప్రత్యర్థులకు గట్టి సందేశం ఇవ్వాలనే లక్ష్యంతో టీమిండియా ఈ సిరీస్‌లో అడుగుపెట్టనుంది.