గోదావరిఖని లో గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్.
• చంద్రపూర్ నుంచి రైలు మార్గంలో తరలింపు..
• 1.50 కిలోల గంజాయి స్వాధీనం.
జనం వాయిస్, గోదావరిఖని, సెప్టెంబర్ 15:
గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 1.50 కిలోల ఎండిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.52,500 ఉంటుందని పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గోదావరిఖని బస్టాండ్ ఔట్‌గేట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులను గమనించిన ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా ఎండిన గంజాయి ఆకులు, పుష్పాలు ఉన్న ప్యాకెట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పంచుల సమక్షంలో విచారించగా, వారు మహారాష్ట్రలోని చంద్రపూర్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
చంద్రపూర్ నుంచి రైలు మార్గంలో మంచిర్యాలకు చేరుకుని, అక్కడి నుంచి ఆటోలో గోదావరిఖనికి వచ్చినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో గంజాయిని విక్రయించి డబ్బులు సంపాదించేందుకు తరలిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పేర్కొన్నారు.
అరెస్టయిన వారిని సికింద్రాబాద్‌కు చెందిన పిన్నోజి గోపి (24), మాచర్ల పవన్ కుమార్ (19) గా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి 1.50 కిలోల గంజాయితో పాటు గంజాయి తరలించేందుకు ఉపయోగించిన బ్యాగ్‌లు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న గంజాయిని పంచుల సమక్షంలో సీజ్ చేసి, పంచనామా ప్రకారం భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
కఠిన చర్యలు తప్పవు
గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని గోదావరిఖని వన్ టౌన్ సిఐ ఇంద్రసేన రెడ్డి ప్రజలను కోరారు.