janamvoice.com
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 3:43 pm Digital Edition : JANAM VOICE

ముత్తారంలో ‘గ్యాస్’ కష్టాలు.

  • ముత్తారంలో ‘గ్యాస్’ కష్టాలు.
  • – 15 రోజులైనా రాని సిలిండర్.
  • –  వినియోగదారుల ఆవేదన.
  • జనం వాయిస్, ముత్తారం, మే 6:
  • పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలోని “రాణా ప్రతాప్ ఇండియన్ గ్యాస్” ఏజెన్సీ తీరుపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని 15 రోజులు గడుస్తున్నా, నేటికీ డెలివరీ కాకపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ వారికి ఫోన్ చేసిన సరైన సమాధానం రావడం లేదని, అధికారుల పర్యవేక్షణ కరువైందని బాధితులు ఆరోపిస్తున్నారు.
  • బుకింగ్ ఉంది.. డెలివరీ లేదు!
  • సాధారణంగా గ్యాస్ బుక్ చేసిన 48 గంటల్లో లేదా గరిష్టంగా వారం రోజుల్లో సిలిండర్ ఇంటికి చేరాలి. కానీ, ఈ ఏజెన్సీ పరిధిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. 15 రోజుల క్రితమే బుక్ చేసుకున్న వారికి కూడా సిలిండర్లు అందడం లేదు. దీనివల్ల పొయ్యి వెలగక పనులు మానుకుని గ్యాస్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కట్టెల పొయ్యిలపై వంట చేసుకోవాల్సి వస్తోందని గృహిణులు వాపోతున్నారు.

ఏజెన్సీ నిర్లక్ష్యం.. అధికారుల మౌనం..

స్టాక్ లేదనే వంకతో డెలివరీని ఆలస్యం చేస్తున్నారని, కానీ బ్లాక్ మార్కెట్‌లో మాత్రం అధిక ధరలకు సిలిండర్లు అందుబాటులో ఉంటున్నాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ బాయ్స్‌ను అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని, ఏజెన్సీ నిర్వాహకులు ఫోన్ చేసినా స్పందించడం లేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చర్యలు తీసుకోవాలని డిమాండ్.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్ సరఫరాలో జాప్యం జరగకూడదని, వెంటనే సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించి ముత్తారం గ్యాస్ ఏజెన్సీపై విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీ లైసెన్స్‌ను రద్దు చేయాలని లేదా భారీ జరిమానా విధించాలని డిమాండ్ చేస్తున్నారు.