విదేశాల్లో చదివే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.180 కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్.
విదేశాల్లో చదివే విద్యార్థులకు పెండింగ్ స్కాలర్‌షిప్ నిధులు విడుదల.
మొత్తం 3,008 మంది విద్యార్థులకు రూ.179.9 కోట్ల కేటాయింపు.
మైనారిటీ విద్యార్థులకు అత్యధికంగా రూ.76.1 కోట్ల విడుదల.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ఆర్థిక శాఖ చర్యలు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కూడా నిధుల పంపిణీ పూర్తి
జనం వాయిస్, తెలంగాణ, సెప్టెంబర్ 12:
తెలంగాణ ప్రభుత్వం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు భారీ ఊరట కల్పించింది. పెండింగ్‌లో ఉన్న ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల కోసం రూ.179.9 కోట్లను తాజాగా విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిధుల కేటాయింపు జరిగింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,008 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
విడుదలైన నిధుల్లో అత్యధికంగా ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద 1,063 మంది మైనారిటీ విద్యార్థులకు రూ.76.1 కోట్లు కేటాయించారు. అలాగే, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి ద్వారా 1,193 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.48.4 కోట్లు, 573 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.36.9 కోట్లు, మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధి కింద 179 మంది బీసీ విద్యార్థులకు రూ.18.4 కోట్లు అందజేయనున్నారు.
ఇప్పటికే స్కాలర్‌షిప్‌లు మంజూరైన లబ్ధిదారులందరికీ చెల్లింపులు పూర్తయ్యాయని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో తమ చదువును ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు ఈ నిధులు దోహదపడతాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.