janamvoice.com
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 11:09 am Digital Edition : JANAM VOICE

రేషన్‌ కార్డులు ఉన్నవారికి శుభవార్త

రేషన్‌ కార్డులు ఉన్నవారికి శుభవార్త

జనం వాయిస్, వెబ్ డెస్క్:

హైదరాబాద్: రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యాన్ని ఏప్రిల్‌ నెలలోనే ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.

ప్రస్తుతం భారత ఆహార సంస్థ (FCI) గోదాముల్లో బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోవడంతో, రాబోయే కొత్త ధాన్యానికి చోటు కల్పించేందుకు ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది.

ప్రస్తుతం నెలకు ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు. మూడు నెలల కోటా కలిపి ఏప్రిల్‌లో ఒక్కో వ్యక్తికి 18 కిలోల బియ్యం అందుతాయి. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులుంటే 72 కిలోలు, ఐదుగురు సభ్యులుంటే ఏకంగా 90 కిలోల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తారు. గత సీజన్లకు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) భారీగా చేరడం, త్వరలో యాసంగి ధాన్య సేకరణ ప్రారంభం కానుండటంతో గోదాములను ఖాళీ చేయడం అత్యవసరంగా మారింది. మూడు నెలల కోటాను ఒకేసారి అందించేందుకు వీలుగా పౌరసరఫరాల శాఖ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తోంది. లబ్ధిదారులు ఒకేసారి వేలిముద్ర వేయాలా లేక మూడుసార్లు వేయాలా అనే సాంకేతిక అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.05 కోట్ల రేషన్ కార్డుల పరిధిలోని 3.40 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఇందుకోసం సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ 1 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పంపిణీ ప్రారంభించాలని యోచిస్తున్నారు.