ప్రకాశం జిల్లాలో గూడ్స్ రైలు ప్రమాదం.
అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన వ్యాగన్లు.
విజయవాడ–చెన్నై ప్రధాన మార్గంలో రాకపోకలకు అంతరాయం.
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టిన రైల్వే అధికారులు.
జనం వాయిస్, ప్రకాశం జిల్లా:
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో గూడ్స్ రైలుకు చెందిన పలువురు వ్యాగన్లు అదుపు తప్పి పక్కనే ఉన్న రెండు రైల్వే ట్రాక్‌లపై పడిపోయాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో వ్యాగన్లు పడిపోవడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే శాఖ అధికారులు, సాంకేతిక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్లు, ఇతర యంత్రాలతో పట్టాలు తప్పిన వ్యాగన్లను తొలగించే పనులు ప్రారంభించారు. ట్రాక్ దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి మరమ్మతులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భద్రతా చర్యలతో పాటు రైల్వే సిబ్బంది అప్రమత్తంగా పనిచేస్తున్నారు. గూడ్స్ బోగీలు పట్టాలు తప్పిన కారణంగా విజయవాడ–చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొన్ని రైళ్లను మళ్లింపు మార్గాల ద్వారా నడిపే అవకాశం ఉందని అధికారులు పరిశీలిస్తున్నారు. రైల్వే ట్రాక్ పూర్తిగా పునరుద్ధరించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రయాణికులు రైళ్ల స్థితిగతులపై ముందస్తు సమాచారం తెలుసుకుని ప్రయాణాలు చేయాలని రైల్వే శాఖ సూచించింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.