janamvoice.com
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 3:50 pm Digital Edition : JANAM VOICE

నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.

నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.

ఉద్యోగాల వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు.
పదేళ్ల అదనపు సడలింపుతో నిరుద్యోగుల్లో ఆనందం.
యూనిఫాం ఉద్యోగాలకు మాత్రం పాత నిబంధనలే.

జనం వాయిస్, హైదరాబాద్, మే 19:

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కోసం గరిష్ఠ వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో వేలాది మంది అభ్యర్థులకు మరోసారి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఉంది. తాజా నిర్ణయంతో అది ఇప్పుడు నలభై నాలుగు సంవత్సరాలకు పెరిగింది. ప్రభుత్వ నిర్ణయంతో అదనంగా పదేళ్ల వయో సడలింపు కల్పించినట్లయింది. ప్రభుత్వం ప్రకటించిన ఈ సడలింపు రాబోయే ఏడాది కాలంలో విడుదలయ్యే అన్ని సాధారణ ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఉద్యోగాల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ నిర్ణయం భారీ ఊరటనిచ్చే అవకాశముందని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జరిగిన జాప్యం, కరోనా పరిస్థితులు, నియామక ప్రకటనలు ఆలస్యంగా రావడం వంటి కారణాలతో అనేక మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయి అవకాశాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి వినతులను పరిశీలించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలు జారీ చేసే సాధారణ ఉద్యోగాలన్నింటికీ ఈ కొత్త నిబంధన వర్తించనుంది. దీంతో పలు శాఖల్లో భవిష్యత్‌లో వెలువడే ఉద్యోగ ప్రకటనలకు మరింత మంది అభ్యర్థులు అర్హత పొందే అవకాశం ఉంది. అయితే పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖల వంటి యూనిఫాం ఉద్యోగాలకు ఈ సడలింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. శారీరక దారుఢ్య ప్రమాణాలు అవసరమైన ఉద్యోగాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న పాత నిబంధనలే కొనసాగుతాయని పేర్కొంది. ఈ నిర్ణయం రాష్ట్ర నిరుద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.