janamvoice.com
Newspaper Banner
Date of Publish : 03 November 2025, 11:04 pm Digital Edition : GATTU MAHESH

గుమ్మడి నర్సయ్య డైరెక్టర్‌ పై శ్యామలాదేవి ప్రశంసలు.

గుమ్మడి నర్సయ్య డైరెక్టర్‌ పై శ్యామలాదేవి ప్రశంసలు.

జనం వాయిస్, సినిమా :

సాధారణ జీవనశైలి, ప్రజల కోసం పోరాటం, నిస్వార్థ రాజకీయ తత్త్వం ఇవి అన్నీ గుమ్మడి నర్సయ్య పేరు వింటే గుర్తుకు వచ్చే లక్షణాలు. ప్రజల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్న సీపీఐ ఎంఎల్‌ నేత గుమ్మడి నర్సయ్య జీవితం ఇప్పుడు వెండితెరపైకి రానుంది. ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతో తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌ నుంచి ఇటీవలే విడుదలైన మోషన్‌ పోస్టర్‌ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది.

ఈ చిత్రంలో కన్నడ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ నర్సయ్య పాత్రలో కనిపించనుండగా, దర్శకుడు పరమేశ్‌ హివ్‌రాలే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మోషన్‌ పోస్టర్‌ను వీక్షించిన దివంగత నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి డైరెక్టర్‌పై ప్రశంసలు కురిపించారు. “మోషన్ పోస్టర్ చూస్తేనే సినిమా స్థాయి తెలుస్తోంది. ఎంతటి అవార్డులు అందుకుంటుందో ఇప్పుడే అర్థమవుతోంది. గుమ్మడి నర్సయ్యగా శివరాజ్‌కుమార్‌ ప్రాణం పెట్టి నటిస్తున్నట్టు కనిపిస్తోంది” అంటూ ఆమె పేర్కొన్నారు.మోషన్ పోస్టర్‌లో సైకిల్‌ తోసుకుంటూ భుజాన ఎర్ర కండువా వేసుకున్న నర్సయ్యను చూపించారు. అసెంబ్లీ ముందు కార్ల వరుసలో సాదాసీదాగా సైకిల్‌తో వస్తున్న దృశ్యం ఆయన ఆత్మీయతను, ప్రజా మనసుకు దగ్గరైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించింది.ప్రవళ్లిక ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎన్‌. సురేశ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ‘చిరు గొడవలు’, ‘లావణ్య విత్ లవ్ బాయ్స్‌’ సినిమాల్లో నటించిన పరమేశ్‌ హివ్‌రాలే ఈ చిత్రంతో దర్శకుడిగా మారడం మరో విశేషం.ఈ బయోపిక్‌ గుమ్మడి నర్సయ్య జీవితం, ఆయన ప్రజాసేవా ప్రస్థానం, నిజాయితీ రాజకీయాల ఆత్మను ప్రతిబింబించనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.