గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.
జనం వాయిస్, మంథని:
తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీ సెట్)- 2026 ద్వారా 2026-2027 వచ్చే విద్యా సంవత్సరానికి గాను 5 వ తరగతి నుండి 9వ తరగతి చదువుకునే విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు ఆహ్వానిస్తున్నట్లుగా పెద్దపెల్లి జిల్లా సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ సమన్వయ అధికారి వుటూరి శ్రీనాథ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి 21 వరకు దరఖాస్తులు తీసుకుంటామని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు అర్హత పరీక్ష ఫిబ్రవరి 22న ఉంటుందని ఆయన వివరించారు. అర్హత గల విద్యార్థులు గురుకులాలను సద్వినియోగం చేసుకోగలరని ఆయన సూచించారు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు 5వ తరగతికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ పరీక్ష ద్వారా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పరిగణలోకి తీసుకుంటామన్నారు. రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజ్గిరి ఫైన్ ఆర్ట్ స్కూల్ లో రాష్ట్రస్థాయి మెరిట్ ఆధారంగా పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు దగ్గర్లోని మీసేవ, ఇంటర్ నెట్ కేంద్రాలను సంప్రదించవలసిందిగా ఆయన సూచించారు. ఒక విద్యార్థి ఒక ఫోన్ నెంబర్ మీద మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన గుర్తు చేశారు. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థి ఫోటో, సంతకం, అభ్యర్థి కుల, ఆదాయ, జనన ధ్రువీకరణ పత్రాలు, గత సంవత్సరం స్టడీ సర్టిఫికెట్, దరఖాస్తు రుసుం 100 రూపాయలుగా ఉంటుందని ఆయన వివరించారు.