ఎత్తులో చిన్నవాడే కానీ షాట్లు మాత్రం భారీగా..
– ఇషాన్ కిషన్‌పై భజ్జీ ప్రశంసల వర్షం.
జనం వాయిస్, హైదరాబాద్, డిసెంబర్ 28:
దేశవాళీ క్రికెట్‌లో ఇషాన్ కిషన్ జోరు కొనసాగుతోంది. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున ఫైనల్‌లో శతకం బాది తొలిసారి టైటిల్ అందించిన ఇషాన్, ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలోనూ మెరుపు ఇన్నింగ్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. కేవలం 33 బంతుల్లో శతకం పూర్తి చేసి, మొత్తం 39 బంతుల్లో 125 పరుగులు చేసిన ఇషాన్ బ్యాటింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 14 సిక్సులు, 7 ఫోర్లు బాదడం విశేషం.
ఇషాన్ కిషన్ ఫామ్‌పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇషాన్ ఎత్తులో చిన్నవాడైనా, అతడి షాట్లు మాత్రం చాలా పెద్దవని భజ్జీ వ్యాఖ్యానించారు. గతంలో తన బౌలింగ్‌ను ఎదుర్కొన్న అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, ఒకసారి నెమ్మదిగా వేసిన బంతిని ఇషాన్ లేటుగా ఆడి కవర్స్ వైపు ఫోర్ కొట్టాడని చెప్పారు. ఆ క్షణంలోనే ఇక నెమ్మదిగా వేయకూడదని నిర్ణయించుకున్నానని, తరువాత బంతిని పూర్తి వేగంతో వేసినా, ఇషాన్ మోకాలి మీద కూర్చొని రివర్స్ స్వీప్ ఆడేశాడని తెలిపారు.
తన బౌలింగ్‌పై ఇషాన్ కొట్టిన స్విచ్ హిట్ ఇప్పటికీ గుర్తుందని, ఆ షాట్ ఇషాన్ కంటే మెరుగ్గా కెవిన్ పీటర్సన్ కూడా ఆడలేదని హర్భజన్ అభిప్రాయపడ్డారు. ఇది ఒక ప్రత్యేకమైన ప్రతిభ అని అప్పుడే ఇషాన్‌కు చెప్పినట్లు వెల్లడించారు. కొంతకాలం వివిధ కారణాల వల్ల టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్ మళ్లీ ఫామ్‌లోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని భజ్జీ అన్నారు. వయసు చిన్నదే అయినా, ఎంతో పరిపక్వతతో ఆడుతున్నాడని, భవిష్యత్తులో భారత క్రికెట్‌కు కీలక ఆటగాడిగా మారతాడని హర్భజన్ ధీమా వ్యక్తం చేశారు.