ప్రేమించాడు.., పెళ్లికి మాత్రం నో..!
– ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి మౌన పోరాటం.
మహబూబాబాద్, జూన్ 1 (జనం వాయిస్) :
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి గ్రామంలో ప్రేమ వ్యవహారం పెళ్లి విషయానికి వచ్చేసరికి వివాదంగా మారి, ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగిన ఘటన సోమవారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన భైరబోయిన మనీషా తెలిపిన వివరాల ప్రకారం, అదే గ్రామానికి చెందిన జూల వంశీతో గత రెండేళ్లుగా ప్రేమ సంబంధం కొనసాగిందని పేర్కొంది. ఈ సమయంలో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా ఉన్నాడని, అయితే ఇటీవల పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా వంశీ నిరాకరిస్తున్నాడని ఆరోపించింది. ప్రేమించిన సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పుడు విస్మరించి తనను మోసం చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసిన మనీషా, సోమవారం నేరుగా వంశీ ఇంటి వద్దకు చేరుకుని మౌన దీక్ష చేపట్టింది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లబోనని స్పష్టం చేసింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్సై రాజ్‌కుమార్ యువతితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చట్టపరంగా విచారణ చేపట్టి, ఎవరికీ అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్సై హామీ ఇచ్చారు. దీంతో యువతి తన మౌన పోరాటాన్ని తాత్కాలికంగా విరమించినట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారంపై గ్రామంలో, బంధువుల మధ్య చర్చలు కొనసాగుతుండగా, ఈ ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభిస్తుందనే ఉత్కంఠ స్థానికంగా నెలకొంది.