నంద్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన.
-ముగ్గురు చిన్నారులకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య.
-కుటుంబ విషాదం… ఆర్థిక, మానసిక ఒత్తిడులే కారణాలా?
-ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.
జనం వాయిస్, నంద్యాల, జనవరి 01:
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో గుండెలు పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ఉయ్యాలవాడ మండలం తుడుమలదిన్నె గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్ర (35) తన ముగ్గురు చిన్న పిల్లలకు విషం ఇచ్చి హత్య చేసి, అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పోలీసుల వివరాల ప్రకారం గురువారం నాడు సురేంద్రతో పాటు అతని పిల్లలు కావ్యశ్రీ (7), జ్ఞానేశ్వరి (4), సూర్య గగన్ (2) మృతదేహాలు ఇంట్లో గుర్తించబడ్డాయి. పిల్లలకు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగించి, వారు మృతి చెందిన అనంతరం సురేంద్ర ఉరివేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో ఆహారం, కూల్‌డ్రింక్ నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. సురేంద్ర భార్య మహేశ్వరి అనారోగ్య కారణాలతో 2025 ఆగస్టు 16న ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నుంచి ముగ్గురు పిల్లల ఆలనాపాలన సురేంద్రే చూసుకుంటున్నాడు. నిర్మాణ పనులకు వెళ్లే సురేంద్ర భార్య మరణంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని, ఆర్థిక ఇబ్బందులు, పిల్లలను ఒంటరిగా పెంచుకోవాల్సిన ఒత్తిడి, మద్యానికి బానిస కావడం వంటి అంశాలు అతన్ని తీవ్ర ఒత్తిడికి నెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటన మద్యం మత్తులో చోటుచేసుకుని ఉండొచ్చన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలిపారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొనగా, చిన్నారుల మృతి స్థానికులను కలచివేసింది.