పాక్ నుంచి వలస వచ్చిన హిందూ దళితులకు ఇండ్లు ఇవ్వాలి : సుప్రీంకోర్టు.
కేవలం పౌరసత్వం సరిపోదన్న ధర్మాసనం.
గౌరవంగా జీవించే హక్కు కల్పించాలని ఆదేశం.
నివాసాల తొలగింపులు నిలిపివేయాలని సూచన.
నాలుగు వారాల్లో కేంద్రం సమాధానం ఇవ్వాలి.
జనం వాయిస్, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2:
పాకిస్తాన్ నుంచి వలస వచ్చి భారత్‌లో నివసిస్తున్న హిందూ దళితులకు ప్రభుత్వం తప్పనిసరిగా ఇండ్లు కేటాయించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేవలం భారత పౌరసత్వం ఇవ్వడం సరిపోదని, గౌరవంగా జీవించే అవకాశం కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ఎన్. కోటేశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందూ దళితులు ప్రస్తుతం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారని కోర్టు గుర్తించింది. ముఖ్యంగా మజ్ను కా తిలా, సిగ్నేచర్ బ్రిడ్జి పరిసరాల్లో ఎక్కువ మంది హిందూ దళితులు నివసిస్తున్నారని పేర్కొంది. అయితే ఆక్రమణల పేరుతో వారి నివాసాలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండటంతో వారు నిత్యం భయంతో జీవిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలు వారి జీవన భద్రతను మరింత దెబ్బతీస్తాయని స్పష్టం చేసింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ దళితులకు పౌరసత్వంతో పాటు పునరావాసం, నివాస సదుపాయాలు కల్పించాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఆక్రమణల తొలగింపు లేదా అభివృద్ధి పనుల పేరుతో వారి ఇళ్లను కూల్చివేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంటూ, ప్రస్తుతం నివాసాల తొలగింపును నిలిపివేయాలని సూచించింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వం తన స్పందన తెలియజేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో సుమారు 250 కుటుంబాలు పాకిస్తాన్ నుంచి వలస వచ్చి నివసిస్తున్నాయని, దాదాపు వెయ్యి మంది వరకు హిందూ దళితులు ఉంటారని అంచనా. కొన్నేళ్లుగా భారత్‌లో జీవిస్తున్నప్పటికీ సరైన నివాస భద్రత లేకుండా గడుపుతున్న వీరి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.