janamvoice.com
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 7:54 pm Digital Edition : JANAM VOICE

హనుమాన్ చాలీసా చదువుతూనే పోరాడా!

హనుమాన్ చాలీసా చదువుతూనే పోరాడా!

గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ప్రధాని మోదీ ఫోన్.

కాక్‌పిట్‌లో జరిగిన ఘటనను ప్రధానికి వివరించిన పైలట్.

జనం వాయిస్, హైదరాబాద్, అక్టోబరు 3:
దుబాయ్ విమానంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో ప్రయాణికుల రక్షణ కోసం ధైర్యంగా పోరాడి గాయపడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో పరామర్శించారు. యూఏఈలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మచ్చర్‌తో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన ప్రధాని.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాక్‌పిట్‌లో ఎదురైన పరిస్థితులను మచ్చర్ ప్రధానికి వివరించారు.

అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికుల భద్రత కోసం పోరాడిన మచ్చర్ ధైర్యాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రయాణికుల రక్షణకు కృషి చేసిన తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. మచ్చర్ త్వరగా కోలుకోవాలని యావత్ దేశం ప్రార్థిస్తోందని తెలిపారు.

ప్రధాని నుంచి నేరుగా ఫోన్ రావడంతో కెప్టెన్ స్మిత్ మచ్చర్ భావోద్వేగానికి గురయ్యారు. మోదీతో మాట్లాడుతూ.. ఆయన తనకు ఎంతో ఆరాధనీయుడని, ప్రధాని నుంచి ఫోన్ వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని అన్నారు.

కష్ట సమయంలో హనుమాన్ చాలీసా..

తనకు అనుకోని, విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు హనుమాన్ చాలీసా పఠించడం అలవాటని మచ్చర్ తెలిపారు. విమాన కాక్‌పిట్‌లో ఘర్షణ చోటుచేసుకున్న సమయంలోనూ తాను హనుమాన్ చాలీసా పఠించానని చెప్పారు. ఆ సమయంలో తాను గాయపడినప్పటికీ తన ప్రాణాల గురించి ఆలోచించలేదని, ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని దేవుడిని ప్రార్థించానని వివరించారు.

తాను ఎలాగైనా లేచి నిలబడాలని గట్టిగా నిర్ణయించుకున్నానని, తాను కదలలేని పరిస్థితి ఏర్పడితే తనతో పాటు విమానంలోని ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని భావించానని మచ్చర్ ప్రధానికి తెలిపారు. ఆ సమయంలో తనకు వచ్చిన ఆలోచన ఒక్కటేనని.. ప్రయాణికులను ఎలాగైనా కాపాడాలనే సంకల్పంతో ముందుకు వెళ్లానని వివరించారు.