100 ఎకరాల పొలం కావాలి..! నటులు మాత్రం వద్దు..!
– మీనాక్షి చౌదరి కండీషన్స్ వైరల్..!!
జనం వాయిస్, సినిమా:
టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీద ఉంది. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆమె, ఈసారి కూడా పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా మీనాక్షి మాట్లాడిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవల జరిగిన ఒక ప్రచార కార్యక్రమంలో తనకు కాబోయే భర్త గురించి మాట్లాడుతూ మీనాక్షి ఆసక్తికరమైన షరతులు పెట్టింది. తన భర్త నటుడు గానీ, డాక్టర్ గానీ, అందాల పోటీల్లో పాల్గొన్న వ్యక్తి గానీ కాకూడదని సరదాగా స్పష్టం చేసింది. తాను ఇప్పటికే సినిమా రంగంలో ఉన్నానని, ఇంట్లో మరోసారి అదే వాతావరణం అవసరం లేదని చమత్కారంగా వ్యాఖ్యానించింది. అలాగే తన జీవిత భాగస్వామికి తప్పనిసరిగా 100 ఎకరాల పొలం ఉండాలని చెప్పి నవ్వులు పూయించింది. వ్యవసాయం, పల్లెటూరి జీవితం అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది.
ఇంటి పనుల విషయంలోనూ మీనాక్షి తనదైన స్టైల్‌లో షరతులు పెట్టింది. వంట చేయడం, బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం వంటి పనులు రావాలని చెప్పింది. గతంలో ప్రేమ వ్యవహారాలు ఉన్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ పొడవుగా ఉండటం మాత్రం తప్పనిసరి అంటూ పేర్కొంది. రోజుకు రెండు మూడు సార్లు ప్రేమను వ్యక్తం చేస్తూ, చిన్న చిన్న బహుమతులు ఇచ్చే వ్యక్తే తనకు సరైన రాజు అని చెప్పింది.
ఇటీవల తనపై వినిపిస్తున్న ప్రేమాయణాల వార్తలను మీనాక్షి ఖండిస్తూ, అవన్నీ అబద్ధాలేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని తెలిపింది. అనగనగా ఒక రాజు సినిమాతో పాటు ఇతర భాషల్లోనూ కీలక పాత్రల్లో నటిస్తూ మీనాక్షి చౌదరి కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది.