janamvoice.com
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 12:34 pm Digital Edition : JANAM VOICE

గాంధీ జయంతి రోజున గోదావరిఖని లో బెల్టు షాపుల దందా!

గాంధీ జయంతి రోజున గోదావరిఖని లో బెల్టు షాపుల దందా!

  • డ్రై డే నిబంధనలకు తూట్లు..
  • గోదావరిఖనిలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు.
  • బెల్టు షాపుల ద్వారా యథేచ్ఛగా మద్యం అమ్మకాలు.
  • అధికారుల నిఘాపై ప్రశ్నలు.

జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 2:

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మద్యం విక్రయాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ గోదావరిఖని పట్టణంలో బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు కొనసాగాయి. గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలు మూసివేయాల్సి ఉన్నప్పటికీ, పట్టణంలోని పలు ప్రాంతాల్లో బెల్టు షాపుల నిర్వాహకులు మద్యం విక్రయాలు చేపట్టారు. వైన్స్ దుకాణాలు మూసివుండటంతో మద్యం కోసం బెల్టు షాపులను ఆశ్రయించిన మందుబాబులకు అక్కడ మద్యం అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా లభించే ధరల కంటే అధిక ధరలకు బాటిళ్లను విక్రయించారు. డిమాండ్‌కు అనుగుణంగా గుట్టుచప్పుడు కాకుండా, కొన్ని ప్రాంతాల్లో బహిరంగంగానే మద్యం విక్రయాలు సాగిన పరిస్థితి కనిపించింది.

డ్రై డే నిబంధనలు ఎక్కడ?

గాంధీ జయంతి రోజున మద్యం విక్రయాలను నియంత్రించాల్సిన సంబంధిత శాఖల నిఘా ఉన్నప్పటికీ బెల్టు షాపుల ద్వారా విక్రయాలు ఎలా కొనసాగాయన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రధాన మద్యం దుకాణాలు మూసివేసినా బెల్టు షాపుల్లో మాత్రం మద్యం అందుబాటులో ఉండటంతో నిబంధనల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బెల్టు షాపులపై చర్యలు ఎప్పుడు?

గోదావరిఖనిలో బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు కొనసాగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. డ్రై డే రోజున సైతం మద్యం విక్రయాలు జరిగితే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. గాంధీ జయంతి రోజునే మద్యం విక్రయాలు కొనసాగడం పట్ల సంబంధిత అధికారులు స్పందించి, పట్టణంలో బెల్టు షాపులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

అడ్డగోలుగా దోచుకున్న బెల్టు షాపు నిర్వాహకులు.

వైన్స్ బంద్ ఉండడంతో ఇదే అదనుగా భావించిన బెల్టు షాపు యజమానులు ఒక్కో క్వాటర్, బీర్ పై 50నుంచి 100 రూపాయలు అదనంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. సంబంధిత అబ్కారి శాఖ అధికారులు స్పందించి బెల్టు షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.