జూలపల్లిలో బీజేపీ నాయకుల వినూత్న నిరసన.
బ్రిడ్జ్ నిర్మాణ శిలాఫలకానికి మొదటి పుట్టినరోజు వేడుక చేసిన బీజేపీ నేతలు.
జూలపల్లి లో పేరుకుపోయిన ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన పెద్దపల్లి ఎమ్మెల్యే.
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అమరగాని ప్రదీప్ కుమార్ గౌడ్.
సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ కార్యకర్తల ర్యాలీ, నిరసన.
జనం వాయిస్, పెద్దపల్లి, జూన్ 23:
తనకు ఓటేసి గెలిపించిన ప్రజల ఋణం తీర్చుకోవాల్సిన పెద్దపల్లి ఎమ్మెల్యే మా మండల ప్రజలపై కక్ష్య కట్టారని అందుకే ఎక్కడి సమస్యలు అక్కడే గాలికొదిలేశారని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు అమరగాని ప్రదీప్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. జూలపల్లి మండలంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన ప్రధాన సమస్యలైన డబుల్ రోడ్డు నిర్మాణం, వాగుపైన బ్రిడ్జ్ నిర్మాణం, మండల కేంద్రంలో 12 ఏళ్ల క్రితం అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు పనులు పూర్తిచేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా బస్టాండ్ నుండి నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. బ్రిడ్జ్ నిర్మాణం కొరకు ఏడాది క్రితం శంఖుస్థాపన చేయగా తట్టెడు మట్టి కూడా తీయలేదని ఏడాది గడిచినా ఎలాంటి పనులు ప్రారంభం చేయలేదంటూ శిలాఫలాకానికి కేక్ కోసి పుట్టినరోజు వేడుక నిర్వహించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అమరగాని ప్రదీప్ కుమార్ గౌడ్, నాయకులు కంకణాల జ్యోతిబస్ లు మాట్లాడుతూ ఎన్నో సార్లు ఈ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించినా కూడా కనీస స్పందన లేదన్నారు. వాగు పైన నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశామని గొప్పగా ప్రగల్బాలు పలికి శంకుస్థాపన చేసి గాలికి వదిలేసారని సంవత్సరం గడిచినా కూడా కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదని ఇది ఎమ్మెల్యే విజయరమణారావు నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. డబుల్ రోడ్డు నిర్మాణ పనులు అట్టహాసంగా మంత్రుల చేత ప్రారంభింపజేసి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా నేటికీ పూర్తి చేయకపోవడం ఎమ్మెల్యే అలసత్వ వైఖరికి నిదర్శనం కాదా అని నిలదీశారు. ఎమ్మెల్యే నిలబెట్టిన సర్పంచ్ అభ్యర్థికి జూలపల్లి ప్రజలు ఓటు వేయలేదని మనసులో పెట్టుకొని ప్రజలపై కక్ష్యకట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాజకీయాలు ఎన్నికలయ్యేంతవరకే చేయాలని, అనంతరం అభివృద్ధి విషయంలో పక్షపాతం చూపకూడదని చురకలంటించారు. ఈ శిలాఫలకానికి ఇదే చివరి బర్త్డే కావాలని, అసంపూర్తిగా నిలిచిపోయిన అన్ని డబుల్ రోడ్డు పనులు త్వరగా పనులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తీగల అశోక్, సంకెండ్ల నర్సయ్య, గుమ్మడి శంకర్, మల్లెత్తుల ఆంజనేయులు, కొల్లూరి స్వామి, పెద్దోళ్ల ఐలయ్య, మెరుగు కనుకయ్య, నాగుల అన్వేష్, తిరుపతి రెడ్డి, కళ్లెపెల్లి అంజి, లక్ష్మీనారాయణ, కంచి శ్రీను, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.