janamvoice.com
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 8:31 pm Digital Edition : JANAM VOICE

పేరు పెట్టండి లక్ష పట్టండి.. గవర్నమెంట్ బంపర్ ఆఫర్

లక్ష ఇళ్ల పథకానికి ప్రజల నుంచి పేర్ల ఆహ్వానం.

– ఉత్తమ పేరుకు రూ. లక్ష బహుమతి
– హైదరాబాద్‌లో భారీ గృహ నిర్మాణ ప్రణాళిక
– జూన్ 28 వరకు సూచనలు పంపే అవకాశం

జనం వాయిస్, హైదరాబాద్, జూన్ 23:

హైదరాబాద్ నగరంలో ప్రతిపాదిత లక్ష ఇళ్ల భారీ గృహ నిర్మాణ పథకానికి ఆకర్షణీయమైన పేరును సూచించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ఆహ్వానించింది. ఈ పథకానికి అత్యుత్తమ పేరును ఎంపిక చేసి సూచించిన వ్యక్తికి తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ (టీజీహెచ్‌బీ) రూ. లక్ష నగదు బహుమతిని ప్రకటించింది.
ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) ప్రాంతంలో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక పథకాన్ని రూపొందిస్తోంది. నగరాభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచే ఈ ప్రాజెక్టుకు ప్రజల భాగస్వామ్యంతో పేరు నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ వివరాలు వెల్లడించారు. ప్రజల ఆలోచనలు, సూచనలకు ప్రాధాన్యత ఇస్తూ పేర్ల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యం ద్వారా ఈ పథకానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు.
ఆసక్తి గల పౌరులు తమ పేర్ల సూచనలను టీజీహెచ్‌బీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంపవచ్చని అధికారులు తెలిపారు. సృజనాత్మకత, తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి భావనలను ప్రతిబింబించే పేర్లకు ప్రాధాన్యత ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
పేర్లను సమర్పించేందుకు ఈ నెల 28వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అందిన సూచనల్లో నుంచి ఉత్తమమైన పేరును ఎంపిక చేసి విజేతను ప్రకటించనున్నట్లు హౌసింగ్ బోర్డు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిస్తున్న ఈ లక్ష ఇళ్ల పథకం ద్వారా మధ్యతరగతి, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో నివాస సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ప్రజల నుంచి విస్తృత స్పందన లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.