అంతా అబద్ధం.. రేవంత్ రెడ్డి ఆరోపణలకు కవిత కౌంటర్.
ఒక్క గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే అప్పగిస్తానని సవాల్.
తనతో పాటు పలువురి ఆస్తులపైనా సీబీఐ విచారణకు డిమాండ్.
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఎదురుదాడి.
గుంపు మేస్త్రీ, గుంటనక్క కలిసే ఉన్నారని కవిత విమర్శ.
ముఖ్యమంత్రిపై తమకు నమ్మకం లేదని వ్యాఖ్య.
జనం వాయిస్, తెలంగాణ డెస్క్, సెప్టెంబర్ 17:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన భూ ఆరోపణలపై తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత తీవ్రంగా స్పందించారు. తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల కంటే ఒక్క గజం భూమి అదనంగా ఉన్నట్లు నిరూపించినా, ఆ భూమిని ప్రభుత్వానికే అప్పగిస్తానని ఆమె సవాల్ విసిరారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేశారని, ఆయన మాటలపై తమకు విశ్వాసం లేదని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆమె డిమాండ్ చేశారు. కేవలం తనపైనే కాకుండా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రస్తావించిన ‘గుంటనక్క’తో పాటు కేసీఆర్ ఫాంహౌస్‌లోని సీఎం గూఢచారి, నవీన్ రావు, కొండల్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, రామేశ్వర్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి తదితరులందరి భూములపై సమగ్ర విచారణ జరిపించాలని కవిత డిమాండ్ చేశారు.
‘గుంపు మేస్త్రీ – గుంటనక్క’ ముమ్మాటికీ కలిసే ఉన్నారని ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కానీ, ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన దానికంటే గజం భూమి అదనంగా ఉన్నా ప్రభుత్వానికే అప్పగిస్తానని ఆమె పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు, కవిత సవాల్‌తో రాష్ట్ర రాజకీయాల్లో భూముల వివాదం మరింత వేడెక్కింది.