జగ్గన్న తోట ప్రభల తీర్థం ఘనంగా నిర్వహణ.
– భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికతతో వెల్లివిరిసిన వేడుక.
– మంత్రులు, ఎంపీలు, నాయకుల పాల్గొనడం.
– శివకృప అందరికీ కలగాలని ఆకాంక్ష : పీవీఎన్ మాధవ్.
జనం వాయిస్, అమలాపురం:
అమలాపురం జగ్గన్న తోటలో నిర్వహించిన ప్రభల తీర్థం భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య అత్యంత ఘనంగా జరిగింది. తరతరాలుగా కొనసాగుతున్న ఈ పవిత్ర ప్రభల తీర్థం కోనసీమ ప్రజల విశ్వాసానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిందని పీవీఎన్ మాధవ్ తెలిపారు.
రంగురంగుల ప్రభలాలు, డప్పుల నాదాలు, శివ నామస్మరణతో జగ్గన్న తోట ప్రాంతం శివమయంగా మారింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ప్రభల తీర్థంలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమం కేవలం ఒక మతాచారం మాత్రమే కాకుండా, ప్రజలను ఐక్యంగా నిలిపే మహా సంప్రదాయమని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొని శివుడిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.
జగ్గన్న తోట ప్రభల తీర్థం కోనసీమ ఆధ్యాత్మిక వైభవాన్ని దేశానికి చాటే ఉత్సవమని పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ పవిత్ర వేడుక ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం మరింత పెరిగిందని పేర్కొంటూ, శివకృప అందరికీ కలగాలని హృదయపూర్వకంగా ఆకాంక్షించారు.