janamvoice.com
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 3:33 pm Digital Edition : GATTU MAHESH

మున్సిపల్ ఎన్నికలకు జనసేన సిద్ధం.ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి ఆర్‌కే సాగర్.

మున్సిపల్ ఎన్నికలకు జనసేన సిద్ధం.

– అన్ని మున్సిపాలిటీల్లో పోటీ చేస్తాం.
– యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది.
– ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి ఆర్‌కే సాగర్.

జనం వాయిస్, కరీంనగర్:

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి జనసేన పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని పార్టీ ప్రచార కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి ఆర్‌కే సాగర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ అభ్యర్థులను బరిలోకి దించేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు.

రాజకీయాల్లో యువరక్తం ఎక్కువగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆర్‌కే సాగర్ పేర్కొన్నారు. అప్పుడే నవసమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యలను నేరుగా అర్థం చేసుకునే శక్తి యువతకు ఉంటుందని, అలాంటి యువ నాయకత్వాన్ని జనసేన పార్టీ ప్రోత్సహిస్తోందని చెప్పారు. నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేసే దిశగా అనేక మంది కొత్త వ్యక్తులను జనసేన పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. కొత్తగా చేరిన వారికి జనసేన కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికినట్లు పేర్కొన్నారు. స్థానిక స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాలకు చెందిన నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.