జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి.
• అదనపు కలెక్టర్‌కు ‘టీఎస్‌జేయూ’ వినతిపత్రం.
జనం వాయిస్, కరీంనగర్, జూన్ 15:
ಜర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణం, హెల్త్ కార్డుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్‌జేయూ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వారు వినతిపత్రం సమర్పించారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా టీ.అనిల్ కుమార్, జిల్లా అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న జర్నలిస్టుల సంక్షేమం నిర్లక్ష్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసినప్పటికీ, ఇప్పటి వరకు ఎన్‌ఓసీలు మంజూరు చేయలేదని తెలిపారు. వెంటనే ఎన్‌ఓసీలు జారీ చేసి, ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టుల హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీఎస్‌జేయూ మంచిర్యాల జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్, రాష్ట్ర నాయకులు సంపత్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడిగె సురేష్, కోశాధికారి సూదుల వెంకటరమణ, ఉపాధ్యక్షుడు పడకంటి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ భాస్కర్, జాయింట్ సెక్రటరీలు సతీష్, ఆవుల శ్రీనివాస్, ఈసీ సభ్యుడు చింతం వెంకటేష్, యూనియన్ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గ ఎన్నిక :
ఇటీవల నిర్వహించిన టీఎస్‌జేయూ జిల్లా కమిటీ నూతన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడిగా వేల్పుల శ్రీనివాస్ పటేల్, ప్రధాన కార్యదర్శిగా బొడిగె సురేష్, కోశాధికారిగా సూదుల వెంకటరమణ, ఉపాధ్యక్షుడిగా పడకంటి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా భాస్కర్, జాయింట్ సెక్రటరీలుగా సతీష్, ఆవుల శ్రీనివాస్, ఈసీ సభ్యుడిగా చింతం వెంకటేష్ ఎన్నికైనట్లు ప్రకటించారు.